జేఈఈ మెయిన్ 2021 షెడ్యూల్ రిలీజ్..నాలుగు సార్లు ఎగ్జామ్

జేఈఈ మెయిన్ 2021 షెడ్యూల్ రిలీజ్..నాలుగు సార్లు ఎగ్జామ్

దేశ వ్యాప్తంగా ఉన్న ఐఐటీ,ఎన్ఐటీల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(JEE Main- 2021)ప‌రీక్ష షెడ్యూల్ ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ)విడుద‌ల చేసింది. దేశంలో కరోనాతో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్‌టీఏ మంగళవారం ఈ పరీక్షల తేదీలను విడుదల చేసింది. వచ్చే ఏడాది జేఈఈ పరీక్ష రాసేందుకు అర్హులైన అభ్యర్థులు డిసెంబర్-15,2020 నుంచి జ‌న‌వ‌రి 15,2021 వ‌ర‌కు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

మంగళవారం (డిసెంబర్ 15న) ప్రారంభమైన జేఈఈ మెయిన్ 2021 దరఖాస్తుల తుది గడువు జనవరి 15,2021తో ముగియనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://jeemain.nta.nic.in/ లో రిజిస్టర్ చేసుకోవాలని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఫీజు చెల్లింపునకు జనవరి-16వరకు తుదిగడువు ఇచ్చిన ఎన్‌టీఏ దరఖాస్తుల్లో మార్పులు చేర్పులకు జనవరి-18నుంచి 21వరకు అవకాశం కల్పించింది.

2021లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నాలుగు విడుత‌ల్లో నిర్వ‌హించాల‌ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణ‌యించింది. ఫిబ్ర‌వ‌రి 22 నుంచి 25 వ‌ర‌కు రోజుకు రెండు విడుత‌ల్లో ఆన్‌లైన్‌ లో జేఈఈ మెయిన్ మొద‌టి ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. మార్చి, ఏప్రిల్, మేలో మ‌రో మూడు విడుత‌ల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు.

సాధారణంగా జేఈఈ-మెయిన్ ఎగ్జామ్ 2 పర్యాయాలు నిర్వహిస్తారు. అయితే 2021లో జేఈఈ మెయిన్స్ పరీక్షలను నాలుగు పర్యాయాలు నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఇటీవల తెలిపారు. గత గురువారం బోర్డు పరీక్షలు, పోటీ పరీక్షలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులతో ఆన్‌లైన్ సంభాషణ సందర్భంగా కేంద్ర మంత్రి ఈ ప్రకటన చేశారు. అభ్యర్థులకు సౌలభ్యాన్ని అందించడానికి ఒకటి లేదా అన్ని పరీక్షలకు హాజరయ్యే ఆప్షన్ ఎంచుకోవచ్చునని మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ పేర్కొన్నారు. మొత్తం పరీక్షలలో అత్యధిక స్కోర్, ర్యాంక్‌ను ప్రవేశాలకు అర్హతగా పరిగణించనున్నారు.