ఇండియన్ జేమ్స్ బాండ్ కి భద్రత పెంపు

ఇండియన్ జేమ్స్ బాండ్ కి భద్రత పెంపు

ajit dovals: ఇండియన్ జేమ్స్ బాండ్ గా పేరుపొందిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్ కు​ భద్రతను పెంచారు అధికారులు. జమ్మూ పోలీసులు అరెస్ట్ చేసిన జైషే మహ్మద్​కు చెందినన హిదాయత్​ ఉల్లా మాలిక్ అనే ఓ ఉగ్రవాది నుంచి స్వాధీనం చేసుకున్న వీడియోలో.. డోభాల్​ ఆఫీసు దగ్గర ఉగ్రవాదులు రెక్కీ నిర్వహించినట్టు ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు డోభాల్ కు భద్రతను పెంచారు.

కాగా, షోపియాన్ కు చెందిన హిదాయత్​ ఉల్లా మాలిక్ ని ఫిబ్రవరి-6న ఓ కేసులో అనంతనాగ్ లో జమ్మూ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ సమయంలో పలు ఆయుధాలను కూడా అతడి దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూలోని గంగ్యాల్ పోలీస్ స్టేషన్ లో అతనిపై చట్టవ్యతిరేక కార్యకాలాపాల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేవారు. జైషే మహమ్మద్ కు చెందిన లష్కర్ ఈ ముస్తఫా ఉగ్ర సంస్థగా చీఫ్ గా హిదాయత్ ఉల్లా మాలిక్ ఉన్నట్లు ఓ పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు.

మాలిక్ ని విచారించే సమయంలో.. పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది మేలో ఢిల్లీకి విమానంలో వచ్చినట్లు మాలిక్ విచారణలో అంగీకరించాడు. ఢిల్లీలో అజిత్ డోభాల్ ఆఫీసు సహా మరికొన్ని ముఖ్యమైన లొకేషన్ల వీడియోలను తీసి డాక్టర్ అని పిలువబడే తన పాకిస్తాన్ కమాండర్ కు వాట్సాప్ లో పంపినట్లు మాలిక్ అంగీకరించాడని పోలీస్ ఉన్నతాధికారి తెలిపారు. అంతేకాకుండా 2019 మధ్యలో సమీర్ అహ్మద్ దార్ అనే వ్యక్తితో సాంబా సెక్టార్ వద్ద రెక్కీ నిర్వహించినట్లు కూడా మాలిక్ అంగీకరించాడని తెలిపారు. 2019నాటి పుల్వామా ఉగ్రదాడి కేసులో గతేడాది జనవరిలో సమీర్ అహ్మద్ దార్ ని ఎన్ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

కాగా, 2016 ఉరీ మెరుపు దాడులు, 2019 బాలాకోట్​ వైమానిక దాడుల ప్రణాళికలో డోభాల్​ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే.. డోభాల్​ను ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు. అంతేకాకుండా అనేక కీలకమైన ఆపరేషన్స్ ను దోవల్ నిర్వహించారు. 1994లో జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ ని భారత దళాలు అరెస్ట్ చేసినప్పడు మసూద్ ని ప్రశ్నించినవారిలో డోభాల్ ఒకరు. అంతేకాకుండా IC-814విమానం హైజాక్ సమయంలో మసూద్ అజార్ ని ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ కు ప్రత్యేక విమానంలో తీసుకెళ్లిన భారత అధికారుల్లో డోభాల్ కూడా ఉన్నారు.