అక్కడ పీతలు..ఇక్కడ ఎలుకలు : 42 ఏళ్ల పాటు నిర్మించిన కాలువ 24 గంటల్లో కొట్టుకుపోయింది

  • Published By: veegamteam ,Published On : August 31, 2019 / 09:09 AM IST
అక్కడ పీతలు..ఇక్కడ ఎలుకలు : 42 ఏళ్ల పాటు నిర్మించిన కాలువ 24 గంటల్లో కొట్టుకుపోయింది

గతంలో మహారాష్ట్రలో సంభవించిన వరదలకు రత్నగిరి జిల్లాల్లో తివారి డ్యామ్ కు గండిపడి పలువురు మృతి చెందారు. డ్యామ్ కు గండి పడటానికి పీతలే కారణమని నీటిపారుదల శాఖ మంత్రి తనాజీ సావంత్ తెలిపటంతో  అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు అటువంటి మరో ఘటన జరిగింది. ఒకటీ రెండూ కాదు ఏకంగా 42 సంవత్సరాల పాటు నిర్మించిన ఓ కాలువ కేవలం 24 గంటల్లో కొట్టుకుపోయింది. ఈ సంఘటన జార్ఖండ్‌లోని హజరీబాగ్‌లో బుధవారం (ఆగస్టు 28)న చోటు చేసుకుంది. 

హజరీబాగ్‌లో కోనార్‌ రివర్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కింద 1978లో రూ. 12 కోట్ల వ్యయంతో కాలువ పనులకు శంకుస్థాపన చేశారు. కానీ కాలువ నిర్మాణం అనుకున్న సమయానికి పూర్తవ్వలేదు. దీంతో కాలువ పూర్తికావటానికి ఏకంగా 42 ఏళ్ల సుదీర్ఘ కాలం పట్టింది. అందుకే కాలువ నిర్మాణ వ్యయం కూడా పెరిగి  రూ. 2,176 కోట్లకు పెరిగింది. ఇలా ఎట్టకేలకూ  కాలువ నిర్మాణం పూర్తవడంతో..సీఎం రఘుబార్‌ దాస్‌ కాలువలోకి నీటిని విడుదల చేసి బుధవారం ప్రారంభించారు.  సీఎం ప్రారంభోత్సవం చేసిన 24 గంటల్లోపే నీటి ఉధృతికి కొట్టుకుపోయింది.

 
కాలువ కొట్టుకుపోయిన ఘటనపై ఇంజినీర్ల కమిటీ వేసారు. వారు పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించి 24 గంటల్లోనే నివేదికను ప్రభుత్వ ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ నివేదికలో ఉన్న విషయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. ఆ కాలువ పొడవునా.. ఎలుకలు అనేక చోట్ల రంధ్రాలు చేయడం వలనే కాలువ కొట్టుకుపోయిందని శుక్రవారం (ఆగస్టు 30) సమర్పించిన నివేదికలో ఇంజనీర్లు తెలిపారు. కాలువ నిర్మాణం పూర్తయిన తరువాత సిమెంట్ పనులు చేయకపోవటంతో ఎలుకలు కాలువ గట్లకు కన్నాలు పెట్టినట్లుగా తెలుస్తోంది. 

 404.17 కి.మీ. పొడవు ఉన్న ఈ కాలువ నిర్మాణంతో ఆ ప్రాంతంలోని 35 గ్రామాల రైతులకు నీటిసదుపాయన్ని కల్పించేందుకు ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణాన్ని చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు  1978 లో అప్పటి ఉమ్మడి  బీహార్ గవర్నర్ జగ్గనాథ్ కౌషల్ పునాదిరాయి వేశారు. కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యంతో కాలువ నిర్మాణం పూర్తి కాలేదు తరువాత  2003 లో అప్పటి సీఎం అర్జున్ ముండా కాలువకు మరోసారి  పునాదిరాయి వేశారు. కాని పని నత్త నడకతోనే జరిగింది. 2012లో ఈ ప్రాజెక్టును ముంబైకి చెందిన ఒక సంస్థ చేజిక్కించుకున్నా పని అంతంత మాత్రంగా జరిగింది. ఇలా కాలువ నిర్మాణానికి 40 దశాబ్దాల కాలం పట్టింది.  దీంతో ప్రాజెక్టు వ్యయం కూడా 1978 లో రూ .12 కోట్ల నుంచి దాదాపు 2,200 కోట్లకు పెరిగింది. ఈ క్రమంలో ఎట్టకేలకూ పూర్తయిన కాలువకు సీఎం ప్రారంభిచటం..తరువాత రెండు రోజులకే అంటే 24 గంటలకే కాలువ కొట్టుకుపోవటం జరిగింది.