Gadget Bank : ఆన్‌లైన్ క్లాస్‌లకు ఉచితంగా ఫోన్‌లు..పేద విద్యార్ధుల కోసం వినూత్న కార్యక్రమం

పేద విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు అందించటానికి ఝార్ఖండ్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా పాత స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు రిపేర్ చేసి.. ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు పంపిణీ చేయనున్నారు.

Gadget Bank : ఆన్‌లైన్ క్లాస్‌లకు ఉచితంగా ఫోన్‌లు..పేద విద్యార్ధుల కోసం వినూత్న కార్యక్రమం

Gadget Bank For Students Online Classes

Gadget Bank for students online classes : కరోనా వచ్చాక అంతా ఆన్ లైన్ క్లాసులే. ఈ క్లాసులకు అటెండ్ అవ్వాలంటే స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. కానీ పేద విద్యార్థులకు స్మార్ట్ కొనుక్కునే ఆర్థిక స్తోమత ఉండకపోవటంతో చాలామంది చదువులు ఆపేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా స్మార్ట్ ఫోన్ కొనుక్కోలేనివారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సహాయం చేయాలనుకున్నాయి. వారి సహకారంతో పేద విద్యార్ధులు ఆన్ లైన్ క్లాసులు అందించటానికి ఝార్ఖండ్ పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఎలక్ట్రానిక్ గాడ్జెట్ బ్యాంకును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీని ద్వారా పాత స్మార్ట్‌ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు రిపేర్ చేసి.. ఆన్‌లైన్ క్లాసుల కోసం విద్యార్థులకు పంపిణీ చేయాలనుకున్నారు. దీనికి సంబందించిన పలు వివరాలను జార్ఖండ్ డీజీపీ నీరజ్ సిన్హా మాట్లాడుతూ..పిల్లల మధ్య అంతరాన్ని తగ్గించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన మేరకు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు. స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు లేని విద్యార్ధులు పాఠాలు వినటానికి లేకుండాపోయింది. దీనివల్ల పేద విద్యార్దులు చదువులకు దూరమవుతున్నారు. దీంతో సమాజంలో ఇప్పటికే ఉన్న అసమానతలు ఇంకా పెరిగే అవకాశముంది. అందుకే పేద విద్యార్థులకు స్మార్ట్‌ఫోన్లు అందించేందుకు గాడ్జెట్ బ్యాంక్‌ ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు.

ఈ వినూత్న కార్యక్రమంలో భాగంగా వాడకుండా పడి ఉన్న పాత ఎలక్ట్రానిక్ డివైజ్‌లను సేకరిస్తారు. వీటిని బాగుచేయించి..అట్టడగు స్థాయిలో ఉన్న విద్యార్థులకు అందజేస్తారు. చాలా ఉపయోగించకుండా పడేసి ఉంచిన పాత ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విరాళంగా తమకు అందజేయాలని పోలీసులు ప్రజల్ని కోరుతున్నారు. ఇళ్లల్లోను..ఆఫీసుల్లోను వాడకుండా నిరుపయోగంగా పడి ఉండేకంటే పేద విద్యార్దులకు విద్యను అందించటానికి ఉపయోగపడేలా చేయాలని కోరుతున్నారు. ఈకార్యక్రమం గురించి పోలీసులు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. ఇలా విరాళంగా ఇచ్చిన డివైజ్‌ల వివరాలను పోలీసులు నమోదు చేసుకుంటారు. వాటి ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడతామని చెప్పారు. ఇలా సేకరించిన డివైజ్‌లను విద్యార్థులకు క్రమ పద్ధతిలో అప్పగిస్తారు. ఫోన్లు, ల్యాప్‌టాప్‌లను విద్య అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని మరి దేని కోసం ఉపయోగించకూడదనే నిబంధన పెడుతున్నారు.

దేశ వ్యాప్తంగా పేద విద్యార్థులు ఆన్ లైన్ క్లాసులు వినడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పిల్లలక విద్యనందించాలని వారి తల్లిదండ్రులు అప్పులు చేస్తున్నారు. వారికున్న కొద్దిపాటి జీవనాధారాలను కూడా అమ్ముకుంటున్న ఘటనల గురించి ఎన్నో విన్నాం. ఇటువంటివారికి కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయం చేస్తున్నాయి. ఇటీవలే ముంబయికి చెందిన ఓ వ్యక్తి జంషెడ్‌పూర్‌కు చెందిన 11 ఏళ్ల బాలికకు స్మార్ట్ ఫోన్ కొనిచ్చి ఆన్ లైన్ క్లాసుల కోసం సహాయం చేశారు. రోడ్డు పక్కన మామిడి పండ్లను అమ్ముతున్న తులసి అనే బాలిక వద్ద 12 మామిడి పండ్లను ఆ వ్యక్తి కొనుగోలు చేశారు. పండుకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1,20,000 చెల్లించారు. ఆ డబ్బును బాలిక తండ్రి బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేశారు. ఇలా పలు ఘటనల్లో పలువురు పేద విద్యార్ధులకు పలువురు దాతలు సహాయం చేసారు. కానీ అందరికి ఇటువంటి సహాయం అందే అవకాశం లేదు. అటువంటివారి కోసం ఝార్ఖండ్ పోలీసులు ఇటువంటి వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు.