గుజరాత్ అసెంబ్లీ నుంచి జిగ్నేష్ సస్పెండ్

  • Published By: venkaiahnaidu ,Published On : December 10, 2019 / 03:30 PM IST
గుజరాత్ అసెంబ్లీ నుంచి జిగ్నేష్ సస్పెండ్

దళిత ఉద్యమనేత, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీని గుజరాత్ అసెంబ్లీ మూడురోజుల పాటు సస్పెండ్ చేసింది. వాగ్దామ్ అసెంబ్లీ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న జిగ్నేష్…అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించినందుకు గానూ ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ మంగళవారం స్పీకర్ రాజేంద్ర త్రివేదీ నిర్ణయం తీసుకున్నారు.

రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని అసెంబ్లీలో జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ రాజ్యాంగాన్ని గురించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జిగ్నేశ్ మేవానీ కలగజేసుకుంటూ థన్ గాధ్ లోని దళితులపై మీరు బుల్లెట్ల వర్షం కురిపించారంటూ సభలో వాడకూడని మాటలు మాట్లాడారు. స్పీకర్ పదే పదే వారిస్తున్నా ఆయన పెడచెవిన పెట్టడంతో సభ నుంచి ఆయనను దూరం పెట్టారు. ఎమ్మెల్యే ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన గుజరాత్ సీఎం విజయ్ రూపానీ.. ఆయనను సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దీంతో సమావేశాలు పూర్తయ్యే మూడు రోజుల వరకు ఆయనను సస్పెండ్ చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు.