ఆజాద్ కు వ్యతిరేకంగా జమ్మూలో కాంగ్రెస్ నిరసన

ఆజాద్ కు వ్యతిరేకంగా జమ్మూలో కాంగ్రెస్ నిరసన

Congress ఆదివారం జమ్ములో ఓ బహిరంగ సభలో ప్రధాని మోడీని ప్రశంసిస్తూ..కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాం నబీ ఆజాద్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. ఆజాద్ తీరుని ఖండిస్తూ మంగళవారం జమ్మూలో కాంగ్రెస్ నేతలు ర్యాలీ నిర్వహించారు. ఆజాద్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.

తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన కాంగ్రెస్‌కు మద్దతు అవసరమైన సమయంలో ఆజాద్‌ దూరంగా ఉంటున్నారని కాంగ్రెస్‌ నేతలు మండిపడ్డారు. ఆజాద్‌ను కాంగ్రెస్‌ ఎంతో గౌరవించిందని..కానీ ఆయన ఇప్పుడు బీజేపీకి స్నేహ హస్తం అందిస్తున్నారని ఆరోపించారు. డీడీసీ ఎన్నిక‌ల ప్రచారానికి కూడా కశ్మీర్ రాని ఆజాద్‌..ఇప్పుడు ప్రధానిని ప్రశంసించేందుకు వస్తున్నారని విమర్శించారు.

కాగా, కొద్ది రోజుల క్రితం రాజ్యసభ నుంచి గులాం న‌బీ ఆజాద్ పదవీ విరమణ అయిన విష‌యం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆజాద్‌ చేసిన సేవలను గుర్తిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం ఆజాద్ జమ్మూలో పర్యటిస్తున్నారు. శనివారం(ఫిబ్రవరి-27,2021)జమ్మూలో… జీ-23గ్రూప్ గా పిలువబడే కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేత‌లలోని కొందరు ముఖ్యులు గులాం న‌బీ ఆజాద్‌ సమక్షంలో ఓ సమావేశంలో పాల్గొని అధిష్ఠానానికి పరోక్షంగా హెచ్చరికలు పంపారు. గతేడాది.. పార్టీలో సమూల సంస్కరణలు కోరుతూ గళమెత్తిన 23 మంది(జీ-23) తిరుగుబాటు నేతల్లో కొందరు శనివారం జమ్మూలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధిష్ఠానంపై తిరుగుబాటు చేసేందుకు ప్రత్యేక కూటమి ఏర్పాటు చేసుకున్నారని పరోక్షంగా సంకేతాలు ఇస్తున్నారనేందుకు ఇదో సూచన అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

ఇక ఆదివారం జమ్మూలో గుజ్లర్ల ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సమావేశంలో పాల్గొన్న ఆజాద్..ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. హోదాలో ఉన్నా ఆయన తన మూలాలు దాచలేదని ప్రశంసించారు. దేశంలోని చాలా మంది నాయ‌కుల‌ంటే తనకిష్టమని…తాను ఓ గ్రామీణ నేప‌థ్యం నుంచి వ‌చ్చి జాతీయ‌స్థాయి నేత‌గా ఎద‌గ‌డం త‌న‌కు ఎంతో గ‌ర్వంగా అనిపిస్తుంద‌న్నారు. మ‌న దేశ ప్రధాని మోదీ కూడా గ్రామీణ నేప‌థ్యం నుంచి వ‌చ్చారని.. ఆయన రాజ‌కీయాల్లోకి రాకముందు టీ అమ్మేవారని తెలిపారు. ప్రధాని ఎప్పుడూ తన మూలాలు మర్చిపోలేదని ప్రశంసించారు.