ఆ రెండింటికీ ముగింపు…కశ్మీర్ కొత్త హాలిడేస్ లిస్ట్ లో కీలక పరిణామం

  • Published By: venkaiahnaidu ,Published On : December 28, 2019 / 01:18 PM IST
ఆ రెండింటికీ ముగింపు…కశ్మీర్ కొత్త హాలిడేస్ లిస్ట్ లో కీలక పరిణామం

జమ్మూకశ్మీర్ హాలీడేస్ లిస్ట్ ఈ సారి మారిపోయింది. 1931లో డోగ్రా బలగాల బుల్లెట్ల వల్ల మరణించిన కాశ్మీరీల గుర్తుగా జులై 13ను సెలవు దినంగా,అదే విధంగా డిసెంబర్ 5 జమ్మూకశ్మీర్ మాజీ ప్రధాని షేక్ అబ్దుల్లా జయంతి పబ్లిక్ హాలీడేగా కొనసాగుతూ వచ్చిన విసయం తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారడంతో 2020 పబ్లిక్ హాలిడేస్ లిస్ట్ నుంచి ఈ రెండు రోజులను తొలగించింది ప్రభుత్వం. వీటి స్థానంలో జమ్మూకశ్మీర్  భారత తో కలిసిన అక్టోబర్ 26ను సెలవు దినంగా ప్రకటించింది. జమ్మూకశ్మీర్ సాధారణ పరిపాలన డిపార్ట్మెంట్ శుక్రవారం రాత్రి 2020లో హాలీడే లిస్ట్ ను విడుదల చేసింది.

అయితే ఈ లిస్ట్ విడుదలపై వ్యాలీలో ప్రధాన రాజకీయ పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఇదొక అసంబద్ధమైన చర్య అని, నియంతృత్వ మనస్తత్వం యొక్క ప్రదర్శనగా వ్యాలీలోని ప్రధాన పార్టీలు ఈ హాలీడే లిస్ట్ ను అభివర్ణించాయి. జూలై 13 మరియు డిసెంబర్ 5 లను జాబితా నుండి తొలగించడం జమ్మూకశ్మీర్ ప్రజల రాజకీయ గుర్తింపుపై దాడి” గా అభివర్ణించారు నేషనల్ కాన్ఫరెన్స్ ప్రతినిధి ఇమ్రాన్ నబీ దార్. ఇలాంటి ఏకపక్ష చర్యలు అబ్దుల్లా పాపులారిటీని దూరంగా తీసుకుపోలేవన్నారు. జులై 13అమరవీరుల త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నారు. బీజేపీ చరిత్రను మార్చలేదని ఇమ్రాన్ అన్నారు. బీజేపీ తన నిజస్వరూపం ప్రదర్శిస్తోందని పీడీపీ పార్టీ విమర్శించింది. జమ్మూకశ్మీర్ రాజకీయ హక్కుల కోసం పోరాడిన నాయకులు,ప్రజల పాత్రను బీజేపీ చెరిపివేయాలనుకుంటుందని పీడీపీ ప్రతినిధి తాహిర్ సయీద్ తెలిపారు. సీపీఐ-ఎం పార్టీలు కూడా కొత్తగా విడుదల చేసిన హాలీడేస్ లిస్ట్ పై విమర్శలు గుప్పించాయి.

జులై-13 ప్రాధాన్యత ఏంటీ

చారిత్రక కథనాల ప్రకారం.. జూలై 13, 1931 న శ్రీనగర్ సెంట్రల్ జైలు బయట చివరి చక్రవర్తి హరిసింగ్ దళాల బుల్లెట్లకు కనీసం 22 మంది కాశ్మీరీలు పడిపోయారు. డోగ్రా పాలకుడికి వ్యతిరేకంగా కాశ్మీర్ యొక్క సుదీర్ఘ ఆందోళనల చరిత్రలో మొదటిసారి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ రోజును స్థానికేతరుడు, అబ్దుల్ ఖదీర్ ఖాన్‌ను మహారాజా పరిపాలన యంత్రాంగం విచారించింది. మహారాజా యొక్క “అణచివేత” పాలనకు వ్యతిరేకంగా ఉద్వేగ ప్రసంగాలు చేసినందుకు ఖాన్ పై దేశద్రోహం, ప్రజలను ప్రేరేపించడం వంటి అభియోగాలు మోపారు. ప్రతి సంవత్సరం, జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, మంత్రులు మరియు ప్రతిపక్ష పార్టీల నాయకులు శ్రీనగర్ లోని ఖవాజా బజార్ ప్రాంతంలోని 22 కాశ్మీరీల సమాధులను సందర్శించి వారికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తూ రావడం ఇప్పటివరకు జరిగింది. ఈ 22మందిని స్వాతంత్ర సమరయోధులుగా గుర్తిస్తారు.

అక్టోబర్-31,2019నుంచి జమ్మూకశ్మీర్ అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా, లఢఖ్ అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికీ కశ్మీర్  భద్రతా బలగాల ఆధీనంలోనే ఉంది.