జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒక్కడోసు, 66 శాతం సమర్థవంతం

జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ ఒక్కడోసు, 66 శాతం సమర్థవంతం

Johnson & Johnson vaccine : ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ అండ్‌ జాన్సన్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌..కరోనా వైరస్‌ను ఎదుర్కోవడంలో 66 శాతం సమర్థంగా పని చేస్తున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా తీవ్ర కేసుల్లో మాత్రం 85శాతం సమర్థత చూపించినట్లు తాజా ఫలితాల్లో వెల్లడైంది. సింగిల్‌ డోసు వ్యాక్సిన్‌ ప్రయోగాలను ప్రపంచ వ్యాప్తంగా జరిపిన జాన్సన్ అండ్‌ జాన్సన్…తాజాగా వాటి ప్రయోగ ఫలితాలను ప్రకటించింది.

సింగిల్‌ డోసు టీకాను అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్‌ జాన్సన్ ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో దాదాపు 60వేల మందిపై మూడోదశ ప్రయోగాలను జరిపింది. అమెరికాలో జరిపిన ప్రయోగాల్లో వ్యాక్సిన్‌ 72శాతం సమర్థత చూపించిందని సంస్థ వెల్లడించింది. లాటిన్‌ అమెరికా దేశాల్లో 66శాతం, దక్షిణాఫ్రికాలో జరిపిన ప్రయోగాల్లో 57శాతం సమర్థత కనబరిచిందని ప్రకటించింది. తీవ్రత ఎక్కువగా ఉన్న కేసుల్లో 85శాతం రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపింది. అంతేకాకుండా కొవిడ్‌ మరణాల నుంచి మాత్రం వందశాతం రక్షణ కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.

వ్యాక్సిన్‌ తీసుకున్న 14రోజుల్లో రక్షణ కల్పిస్తుందని తాజా ఫలితాల్లో వెల్లడైనట్లు కంపెనీ పేర్కొంది. ఇప్పటి వరకు అందుబాటులోకి వచ్చిన వ్యాక్సిన్‌లన్నీ తప్పనిసరిగా రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే, జాన్సన్‌ ఆండ్‌ జాన్సన్‌ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ ఒకే డోసు సరిపోతుంది. అంతేకాకుండా సాధారణ రిఫ్రిజిరేటర్‌ ఉష్ణోగ్రతల వద్దే దీన్ని నిల్వ ఉంచుకునే అవకాశం ఉంది. అందుకే ఈ వ్యాక్సిన్‌ను కూడా గేమ్‌ ఛేంజర్‌గానే భావిస్తున్నారు.