Joshimath Sinking : ఇక ఏమాత్రం ఒత్తిడి తట్టుకోలేదు, ఏ క్షణమైనా ఘోరం జరిగిపోవచ్చు? డేంజర్ జోన్‌లో జోషిమఠ్

ఉత్తరాఖండ్ లోని దేవభూమి జోషిమఠ్ లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మరిన్ని ఇళ్లకు బీటలు వారడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ఇళ్లలో ఉండలేక ఎముకలు కొరికే చలిలో రోడ్లపైనే గడుపుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్ లో పర్యటించారు.

Joshimath Sinking : ఇక ఏమాత్రం ఒత్తిడి తట్టుకోలేదు, ఏ క్షణమైనా ఘోరం జరిగిపోవచ్చు? డేంజర్ జోన్‌లో జోషిమఠ్

Joshimath Sinking : ఉత్తరాఖండ్ లోని దేవభూమి జోషిమఠ్ లో పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. మరిన్ని ఇళ్లకు బీటలు వారడంతో ప్రజలు వణికిపోతున్నారు. ఎప్పుడు కూలుతాయో తెలియని ఇళ్లలో ఉండలేక ఎముకలు కొరికే చలిలో రోడ్లపైనే గడుపుతున్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి జోషిమఠ్ లో పర్యటించారు.

శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నారని, అయితే తమ ప్రథమ కర్తవ్యం ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడమే అన్నారు. గత ఏడాది కాలంగా జోషిమఠ్ లో భూమి కుంగిపోతోంది. గత 15 రోజులుగా పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. వేల సంఖ్యలో ఇళ్లు బీటలు వారాయి. రోడ్లు కుంగిపోతున్నాయి. కొన్ని ఇళ్లు ఏ క్షణంలో కూలిపోతాయో తెలియని పరిస్థితి ఉంది.

అయితే, జోషిమఠ్ ఇక ఏ మాత్రం ఒత్తిడిని తట్టుకునే పరిస్థితిలో లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. డెహ్రాడూన్ లోని హిమాలయన్ జియాలజి ఇన్ స్టిట్యూట్ డైరెక్టర్ కాలాచంద్ సెయిన్ కూడా ఇదే హెచ్చరిక చేస్తున్నారు. ఆ ప్రాంతం ఇక ఏ మాత్రం నివాస యోగ్యం కాదని కాలాచంద్ హెచ్చరిస్తున్నారు. జియాలజిస్ట్ అయిన కాలాచంద్ కీలక విషయాలు వెల్లడించారు.

Also Read..Joshimath Sinking : రోడ్లపై పగుళ్లు, కూలుతున్న ఇళ్లు, కుంగుతున్న భూమి.. జోషిమఠ్‌లో అసలేం జరుగుతోంది? ఈ భయానక పరిస్థితులకు కారణం ఏంటి?

జోషిమఠ్ పురాతన కాలం నాటిది. అయితే, ఇప్పుడున్న పట్టణం మాత్రం సహజ సిద్ధమైన భూమిపై ఏర్పడ లేదని కాలాచంద్ తో పాటు చాలా మంది జియాలజిస్ట్ లు చెబుతున్నారు. చాలా దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది. ఆ సమయంలో భారీగా కొండచరియలు, మట్టిపెళ్లలు విరిగిపడ్డాయి. కాలక్రమేణ ఆ ప్రాంతంపై పట్టణం విస్తరించింది. అంటే, భూమి ఏ మాత్రం గట్టిగా లేదు.

డొల్లగా ఉన్న ప్రాంతంపైనే భారీ కట్టడాలు నిర్మించారు. అంతేకాదు, ఈ ప్రాంతం సెస్మిక్ జోన్-5లో ఉందని, అంటే భూకంపాలు సంభవించేందుకు ఆస్కారాలు ఎక్కువ అని డాక్టర్ కాలాచంద్ హెచ్చరించారు. 2021లోనే హిమాలయన్ జియాలజి ఇన్ స్టిట్యూట్ జోషిమఠ్ పరిస్థితిపై ఓ నివేదికను సమర్పించింది. ప్లేట్ కదలికల వల్ల ఏర్పడుతున్న పరిణామాలే కాకుండా అభివృద్ధి కార్యకలాపాల పేరిట చేస్తున్న తవ్వకాలు వంటికి జోషి మఠ్ ను ప్రమాదకర స్థితిలోకి నెట్టేశాయని అందులో పేర్కొన్నారు.

హిమాలయ పర్వత ప్రాంతంలో సముద్ర మట్టానికి 6వేల అడుగుల ఎత్తులో ఉన్న జోషిమఠ్ పరిస్థితిపై 1976 నాటి నివేదిక ఒకటి ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిశ్రా కమిటీ ఈ నివేదికను సమర్పించింది. ఎప్పటికైనా ఆ పట్టణం కుంగిపోతుందని, అభివృద్ధి పేరిట భారీ కట్టడాల వంటి వాటికి అనుమతి ఇవ్వొకూడదని అందులో పేర్కొన్నారు.

Also Read.. Joshimath Sinking : ద్వారకలానే.. చరిత్రలో కలిసిపోనున్న మరో చారిత్రక పట్టణం..! జోషిమఠ్‌లో భయం భయం

ఎన్నో ఏళ్లుగా హెచ్చరికలు ఉన్నా, ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోలేదు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతంపైనే ఏకంగా 20వేల మందికిపైగా ఉంటున్నారంటే ఏ స్థాయిలో కట్టడాలు నిర్మించారో అర్థమవుతుంది. పైగా నీటి వనరుల సహజ ప్రవాహాన్ని అడ్డుకోవడం కూడా దెబ్బతీసింది. నదులకు ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయడంతో నీరు కిందకు వెళ్లటానికి వేరే మార్గాలను వెతుక్కోవాల్సి వచ్చింది. ఫలితంగా భూమి లోపల పొరలు విచ్చిన్నమయ్యాయి. పైగా నీరు దారి మళ్లడంతో రాళ్లు కూడా కోతకు గురయ్యాయి.

అంతే కాకుండా జోషిమఠ్, తపోవన్, విష్ణుఘాట్ ప్రాంతాల్లో జల విద్యుత్ కేంద్రాలకు అనుమతులు ఇచ్చారు. హైడల్ పవర్ ప్రాజెక్ట్ కోసం సొరంగాలు తవ్వడం, బండరాళ్లు పేల్చడం వంటి కార్యకలాపాలతో భూమి మరింత వేగంగా కుంగిపోయింది. ఆ ప్రాజెక్టులే ఇప్పుడు జోషిమఠ్ ను పూర్తిగా నివాస యోగ్యం కాని ప్రాంతంగా మార్చాయి. ఏళ్ల తరబడి మానవ విధ్వంసాన్ని తట్టుకుని నిలబడ్డ జోషిమఠ్.. ఇక ఏ మాత్రం ఒత్తిడిని తట్టుకునే పరిస్థితి లేదని తేలిపోయింది. ఫలితంగా 30వేల మంది ప్రమాదపు అంచున బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.