న్యాయ ప్రక్రియ సామాన్యులకు అందుబాటులో లేదన్న రాష్ట్రపతి

  • Published By: venkaiahnaidu ,Published On : December 7, 2019 / 02:45 PM IST
న్యాయ ప్రక్రియ సామాన్యులకు అందుబాటులో లేదన్న రాష్ట్రపతి

న్యాయ ప్రక్రియ ఖరీదైనదిగా మారిందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. మన దేశంలో న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందుబాటులో లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం(డిసెంబర్-72019) రాజస్థాన్ హైకోర్టు నూతన భవనాన్ని శనివారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు.

అనేక కారణాల వల్ల న్యాయ వ్యవస్థ సామాన్యులకు అందనంత దూరంలో ఉందని కోవింద్ అన్నారు. ముఖ్యంగా సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించడం సామాన్య కక్షిదారులకు అసాధ్యంగా మారిందన్నారు. నేడు ఎవరైనా పేద, నిర్భాగ్య వ్యక్తి తన ఫిర్యాదుతో ఇక్కడికి రాగలుగుతున్నారా? అందరికీ న్యాయం అందజేసే బాధ్యతను మనమంతా మన రాజ్యాంగ ప్రవేశికలో అంగీకరించినందువల్ల ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదని అన్నారు.

న్యాయ ప్రక్రియలో భరించవలసి వస్తున్న ఖర్చుల గురించి మహాత్మా గాంధీ కూడా ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. ఆయనకు నిరుపేదల సంక్షేమమే ఎల్లప్పుడూ ముఖ్యమైనదని చెప్పారు. గాంధీ గారి సుప్రసిద్ధ సిద్ధాంతాన్ని మనసులో ఉంచుకున్నా, నిరుపేదలు, బలహీనుల ముఖాన్ని గుర్తుంచుకున్నా, మనకు మంచి మార్గం కనిపిస్తుందన్నారు. ఉచిత న్యాయ సహాయం అందజేయడం ఓ మార్గమని తెలిపారు.