Juhi Chawla: 5Gపై పిటీషన్ వెనక్కి తీసుకున్న జూహీ చావ్లా.. రూ.20లక్షలు కట్టేందుకు గడువు

బాలీవుడ్ నటి జూహీ చావ్లా 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌పై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

Juhi Chawla: 5Gపై పిటీషన్ వెనక్కి తీసుకున్న జూహీ చావ్లా.. రూ.20లక్షలు కట్టేందుకు గడువు

Juhi Chavla

Juhi Chawla: బాలీవుడ్ నటి జూహీ చావ్లా 5జీ వైర్‌లెస్ నెట్‌వర్క్‌పై ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. గత నెలలో ఆమె వేసిన దావాను కోర్టు కొట్టివేయగా.. పిటిషన్‌పై ఎటువంటి విచారణ జరగలేదు కాబట్టి, తాను వేసిన దావాను కొట్టివేయకుండా, ఆమోదయోగ్యం కాని పిటీషన్‌గా పేర్కొని తిరస్కరించాలంటూ జూహీ చావ్లా కోర్టును అభ్యర్థించారు. జూహీ చావ్లా తరపు న్యాయవాదుల వాదన విన్న హైకోర్టు పిటీషన్‌ను ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇచ్చారు.

దేశంలోని 5జీ నెట్‌వర్క్‌పై జూహీ చావ్లా పిటిషన్ దాఖలు చేశారు. జూహీచావ్లా వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంను పరిశీలించిన కోర్టు జూన్ 4న కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. పబ్లిసిటీ కోసమే పిటిషన్ దాఖలు చేసినట్లు కనిపిస్తోంది అంటూ చావ్లాకు రూ.20 లక్షల జరిమానా విధించింది హైకోర్టు. ఈ డబ్బులు చెల్లించడానికి ఇప్పుడు వారం రోజుల గడువు కూడా ఇచ్చింది కోర్టు.

5జీ టెక్నాలజీని అనుమతించొద్దంటూ.. జూవీ చావ్లా చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు ఇంతకుముందే తిరస్కరించింది. టెక్నాలజీ అన్న తరువాత కచ్చితంగా అప్‌గ్రేడ్‌ కావాల్సిందేనని అభిప్రాయపడింది హైకోర్టు. ఈ అంశంపై కోర్టును ఆశ్రయించడానికి ముందే ప్రభుత్వానికి లేఖ రాయాల్సిందని అభిప్రాయపడింది. ఈ పిటిషన్‌లోని వాదన సహేతుకంగా లేదని, అనవసరంగా పిటిషన్ వేశారని హైకోర్టు అభిప్రాయపడింది.

5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయని తన పిటిషన్‌లో పేర్కొన్న జూహీ చావ్లా.. దీని కారణంగా పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని కోరింది. ఈ మేరకు జూహీచావ్లాతోపాటు మరో ఇద్దరు పిటిషనర్లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తమ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను అపోజిషన్‌గా చేర్చారు.

అయితే ఈ దీనిపై కేంద్రం కూడా తమ వాదనలు వినిపించింది. ఇదంతా పబ్లిసిటీ స్టంట్ కోసమేనని, పిటిషన్ను కొట్టేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. దీంతో జూహీ చావ్లా పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు. అంతేకాదు.. జూహీ చావ్లాతోపాటు పలువురికి రూ.20లక్షల జరిమానా విధించింది.