ఎల్టీటీఈని అంతం చేసినట్లే.. మావోయిస్టులను ఏరివేస్తారా?

ఎల్టీటీఈని అంతం చేసినట్లే.. మావోయిస్టులను ఏరివేస్తారా?

Just Like Ending The Ltte Will The Maoists Rise

దూసుకొస్తున్న బుల్లెట్లు.. శరీరాన్ని చీలుస్తున్న తూటాలు.. ట్రాప్‌లో పడినట్లు అర్థమైనా.. ధైర్యం వీడలేదు.. దాసోహం అంటూ చేతులెత్తలేదు.. మావోయిస్టులకు సరైన సమాధానం చెప్పారు. ఛత్తీస్‌ఘడ్ ఎన్‌కౌంటర్ రోజు జరిగింది ఇది.. ఈ ఘటన తర్వాత కేంద్రం ప్రతీకారంతో రగిలిపోతుంటే.. చర్చలకు సిద్ధమని మావోయిస్టులు మరోసారి ప్రకటించారు. మరి ఇకపై ఏం జరగబోతోంది ?

పోరాటం ఎందుకు ఎలా మొదలుపెట్టారో… ఎటు వెళ్తున్నారో ! మావోయిస్టుల దురాగతాలపై వినిపిస్తున్న మాటలివి ! పోరాటంలో నేలకొరిగిన జవాన్లు, తుపాకీ తూటాలతో తూట్లు పడ్డ చెట్లు.. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల మధ్య.. ఛత్తీస్‌ఘడ్ ఎన్‌‍కౌంటర్ వంద ప్రశ్నలు సంధిస్తోంది. అడవిపై ఆధిపత్యం కోసం మావోయిస్టులు సృష్టించిన మారణహోమం.. మరో చర్చకు దారితీస్తోంది. ఎన్‌కౌంటర్ జరిగిన రోజు ఇదీ పరిస్థితి అంటూ వైరల్ అవుతోన్న కొన్ని ఆడియోలు.. ప్రతీ ఒక్కరిని మనసును మెలేస్తున్నాయిప్పుడు.

పక్కా పథకం రచించి… తమకు పూర్తిగా అనుకూలమైన ప్రాంతంలోకి జవాన్లను రప్పించి .. మావోయిస్టులు ఊచకోత చేశారు. హిడ్మా ఉన్నాడంటూ ఉప్పందించి.. ఊరించి.. బలగాలు దండకారణ్యంలోకి వచ్చేలా చేశారు. కోబ్రా, ఎస్టీఎఫ్, డీఆర్‌జీకి చెందిన బలగాలు దండకారణ్యంలోకి ఎంటర్ అయ్యాయ్. లోపలికి ప్రవేశించిన కాసేపటికే వాళ్లకు పరిస్థితి అర్థం అయింది. ట్రాప్‌లో చిక్కుకున్నామని.. చాపర్ పంపించాలంటూ శాటిలైట్ ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఐతే హెలికాప్టర్ చేరుకున్న ప్రదేశానికి మూడు కిలోమీటర్లు నడవాల్సిన పరిస్థితి. ఈ సమయంలోనే మావోయిస్టులు రెచ్చిపోయారు. రక్తపాతం సృష్టించారు. అత్యాధునిక ఆయుధాలతో విరుచుకుపడ్డారు. 22మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్నారు.

చుట్టూ అడవి.. ఎత్తైన ప్రదేశంలో మాటేసి తూటాలు పేలుస్తున్న మావోలు.. ఇలాంటి పరిస్థితుల్లోనూ ధైర్యం వీడలేదు జవాన్లు! తూటాలకు తూటాతోనే దీటుగా సమాధానం చెప్పారు. బుల్లెట్లు శరీరాన్ని చీల్చుతున్నా.. అప్పటివరకు పక్కనే ఉన్న జవాన్ విగతజీవిగా మారినా.. ధైర్యం కోల్పోదు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఆరు గంటలు… దండకారణ్యం తుపాకుల మోతతో ప్రతిధ్వనించింది. ఎన్‌కౌంటర్ సమయంలో జరిగింది ఇదీ అంటూ వైరల్ అవుతున్న ఆడియోలు.. జవాన్ల ధైర్యానికి… మావోయిస్టుల ఘాతుకానికి అద్దం పడుతున్నాయ్. తరెమ్ ఎన్‌కౌంటర్‌పై కేంద్రం ప్రతీకారంతో రగిలిపోతోంది. బదులు తీర్చుకునేందుకు సిద్ధం అవుతోంది.

మావోయిస్టుల నోట మరోసారి చర్చల మాట వినిపించింది. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే… తమ దగ్గర బందీగా ఉన్న జవానును అప్పగిస్తామంటున్నారు. తాము చెరపట్టిన జవాన్ రాకేశ్వర్ ఫోటోను మీడియాకు విడుదల చేశారు. ఆపరేషన్‌ ప్రహార్‌- ఆపరేషన్‌ సమాధాన్లో భాగంగా.. 150మందికి పైగా గ్రామీణ ప్రజల్ని భద్రతా బలగాలు చంపాయని.. వీరిలో మావోయిస్టు పార్టీ కార్యకర్తలు, నాయకులతోపాటు కొందరు ప్రజలు ఉన్నారన్నారు.

వేలాదిమందిని జైళ్లలో పెట్టారని, మహిళలను హింసించి హత్యచేశారని ఆరోపించారు. సమాధాన్‌- ప్రహార్‌కు పీఎల్‌జీఏ ప్రతీకారం తీర్చుకుందని మావోలు లేఖ విడుదల చేశారు. అటు మావోయిస్టులపై రెట్టింపు ప్రతీకారంతో కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్‌ ప్రహార్‌కి సిద్ధమైంది. జవాన్ల త్యాగాలను వృథా కానివ్వబోం.. మావోయిస్టులపై పోరును ఉధృతం చేస్తామన్న అమిత్ షా.. ఢిల్లీలో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు.

ఆ వెంటనే కేంద్ర బలగాలు ఆపరేషన్‌కు సిద్ధమయ్యాయ్. హెడ్మాతోపాటు.. 8మంది మావోయిస్టు నాయకులను టార్గెట్‌గా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పుడు ఇలానే ఊరుకుంటే.. బలగాల ఆత్మస్థైర్యం దెబ్బతినే ప్రమాదం ఉందని హోంశాఖ వర్గాలు అనుమానిస్తున్నాయ్. దీంతో వీలైనంత త్వరగా ఆపరేషన్‌ ప్రారంభించాలని నిర్ణయించాయి. మావోయిస్టు అగ్రనేతలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండడంతో.. అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశాయ్.

ఎల్టీటీఈని అంతమొందించిన తరహాలోనే మావోయిస్టులను ఏరివేయాలని కేంద్రం నిర్ణయించుకుంది. ఇక అటు ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్ జరిగినా కూడా… కేంద్ర బలగాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలన్న దృఢమైన సంకల్పంతోనే అడుగులు వేస్తున్నాయ్. ఇప్పటికే దండకారణ్యాన్ని అన్నివైపులా భద్రతా బలగాలు చుట్టుముట్టాయ్. ఛాన్స్ దొరికితే ట్రిగ్గర్ నొక్కేందుకు రెడీగా ఉన్నాయ్.

పోలీసులు తమకు శత్రువులు కాదు అంటున్న మావోయిస్టులు.. వలవేసి మరీ రక్తపాతం సృష్టించారే… ఈ హత్యాకాండను వాళ్లు ఎలా సమర్థించుకోగలరు.. ఎంతో జీవితం ముందున్న ఈ యువకులను చంపి మావోయిస్టులు సాధించేదేమిటన్న ప్రశ్నలు వెంటాడుతున్నాయ్.

ఛత్తీస్‌ఘడ్‌లో హిడ్మా పేరు బయటకురావడంతో.. అలాంటి నేతలపై కేంద్రం దృష్టి సారించింది.. ప్రమాదకరంగా మారిన మరికొందరు మావోయిస్ట్‌ నేతల పేర్లతో మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాను సిద్ధం చేశారు అధికారులు.. ఈ లిస్ట్‌లో మొత్తం 124 మంది అగ్రనేతల పేర్లను చేర్చారు.. వీరిలో 54మంది తెలంగాణకు చెందినవారే ఉన్నారు. వీరందరిపై రివార్డులు కూడా పెరిగాయి. ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒడిశా రాష్ట్రాల్లోని దండకారణ్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మావోయిస్టులు కీలకంగా మారారు. దీంతో ఎస్ఐబీ, ఎన్ఐఏ మార్గదర్శకాలతో గణపతితో పాటు బస్వరాజ్ లాంటి నేతలపై రివార్డు పెంచారు.