కోహినూరు వజ్రం.. కోర్టు విడిచిపోతుంది : నల్లకోటు నీరాజనం

  • Published By: vamsi ,Published On : March 6, 2020 / 07:59 AM IST
కోహినూరు వజ్రం.. కోర్టు విడిచిపోతుంది : నల్లకోటు నీరాజనం

ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా కూడా ప్రభుత్వాలకు భజన చెయ్యడం పరిపాటి అయ్యిపోయింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తి సైతం ఇటీవల మోడీపై ప్రశంసలు కురిపించడం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే. అయితే దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లపై విచారణ సందర్భంగా పోలీసుల తీరును ప్రశ్నించి రాత్రికి రాత్రే బదిలీ అయిన ఢిల్లీ హైకోర్టు జడ్జి ఎస్‌.మురళీధర్‌ మాత్రం ప్రత్యేకం. 

సత్యం కోసం నిలబడి, నిజాయితీగా పనిచేసి పలువురి మన్ననలు పొందిన మురళీధర్..  పంజాబ్, హర్యాణా హైకోర్టుకు బదిలీ అవ్వగా.. ఢిల్లీలో గురువారం ఢిల్లీ హైకోర్టు జడ్జీలు, లాయర్లు మురళీధర్‌‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. నల్లకోటులతో అట్టహాసంగా కోర్టు ప్రాంగణం నలుపు రంగు పులుముకున్నట్లుగా మారిపోగా.. కోహినూరు వజ్రం లాంటి అరుదైన వ్యక్తి కోర్టు విడిచి వెళ్లిపోతున్నారంటూ ఆ కోర్టు లాయర్లు అభిప్రాయపడ్డారు.

ఈ సంధర్భంగా మాట్లాడిన జస్టీస్ మురళీధర్.. బదిలీ విషయం తనకు ముందే తెలుసునని, న్యాయస్థానాల్లో అందరూ ‘సత్యం వైపు నిలవాలి. తప్పకుండా న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. తన బదిలీపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందస్తుగానే సమాచారం అందించారని, ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పడంతోనే పంజాబ్‌–హరియాణా కోర్టుకు బదిలీ చేశారని తెలిపారు.

ఢిల్లీలో విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నాయకులు అనురాగ్‌ ఠాకూర్, పర్వీష్‌ వర్మ, కపిల్‌ మిశ్రాలపై ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు దాఖలు చేయలేదని ప్రశ్నించిన మురళీధర్‌ను కేంద్రం బదిలీ చేయడం విమర్శలకు తావిస్తుంది. జస్టిస్ మురళీధర్ 1984 సెప్టెంబరులో చెన్నైలో తన న్యాయ ప్రాక్టీసును ప్రారంభించారు. 1987లో సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టులో ప్రాక్టీస్ చేయడానికి ఢిల్లీకి మారారు. 2006 లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.