మా మేనిఫెస్టోను డీఎంకే కాపీ కొట్టింది : కమల్‌హాసన్‌

డీఎంకే- మక్కల్‌ నీది మయ్యం పార్టీల మధ్య మేనిఫెస్టో వార్‌ ముదురుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్‌ విజన్ డాక్యుమెంట్‌పై మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ విరుచుకుపడ్డారు. తమ మేనిఫెస్టోను డీఎంకే కాపీ కొట్టిందని కమల్ హాసన్‌ ఆరోపించారు.

మా మేనిఫెస్టోను డీఎంకే కాపీ కొట్టింది : కమల్‌హాసన్‌

Kamal Haasan angry over DMK : తమిళనాడులో పొలిటికల్‌ హీట్‌ పతాక స్థాయికి చేరింది. డీఎంకే- మక్కల్‌ నీది మయ్యం పార్టీల మధ్య మేనిఫెస్టో వార్‌ ముదురుతోంది. డీఎంకే అధినేత స్టాలిన్‌ విజన్ డాక్యుమెంట్‌పై మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌ హాసన్‌ విరుచుకుపడ్డారు. తమ మేనిఫెస్టోను డీఎంకే కాపీ కొట్టిందని కమల్ హాసన్‌ ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే.. రేషన్ కార్డు ఉన్న ప్రతి గృహిణికి 1,000 రూపాయల నగదును ఇస్తామని డీఎంకే అధినేత స్టాలిన్ ప్రకటించారు. అయితే ఈ హామీ వాస్తవానికి తమదని కమల్ హాసన్‌ చెబుతున్నారు. అధికారంలోకి వస్తే యువతకు 50లక్షల ఉద్యోగాలు ఇస్తామని డీఎంకే తమ మేనిఫెస్టోలో పొందుపరిచింది.

ఈ రెండు వాగ్ధానాలు కమల్‌ హాసన్‌ నాలుగు రోజులు ముందు ప్రజలకు ఇచ్చినవి. దీంతో డీఎంకే ఒక కాపీ పార్టీ అంటూ కమల్‌ హాసన్‌ విరుచుకుపడ్డారు. సొంతంగా మేనిఫెస్టో కూడా తయారు చేసుకోలేని పార్టీ అంటూ చురకలంటించారు. ఏళ్ల తరబడి అవినీతి పాలన కొనసాగిస్తున్న పాత ద్రవిడ పార్టీలకు కాలం చెల్లిందని విమర్శించారు. ఇక వారంతట వారే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదని కమల్‌ సలహా ఇచ్చారు.

ఎన్నికల మేనిఫెస్టోలో డీఎంకే పార్టీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. స్టాలిన్‌ ఏడు హామీలు పేరుతో పదేళ్ల ప్రణాళిక విడుదల చేశారు. ఈ మేనిఫెస్టో తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఎంపిక చేసిన రంగాల్లో రాబోయే పదేళ్లలో చేపట్టబోయే పనుల వివరాలను తిరుచ్చిలో జరిగిన భారీ బహిరంగ సభలో స్టాలిన్‌ ప్రకటించారు. రాబోయే పదేళ్లలో ప్రతీ ఏడాదికి పది లక్షల ఉద్యోగాల వంతున కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

తద్వారా ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 36 లక్షల కుటుంబాలకు ప్రతీ ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందివ్వడంతో పాటు మంచినీటి వృధాను అరికడగతామని హామీ ఇచ్చారు. సామాజిక న్యాయంలో భాగంగా స్కాలర్‌షిప్పులు రెట్టింపు చేస్తామన్నారు. రేషన్‌ కార్డు ఉన్న ప్రతీ గృహిణికి నెలకు వెయ్యి రూపాయల ఫించను అందిస్తామన్నారు.