రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

Karnataka Agri Minister రైతుల ఆత్మహత్యలపై కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మానసికంగా బలహీనంగా ఉన్న రైతులే ఆత్మహత్య చేసుకుంటారని.. అలాంటి ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదని తెలిపారు. రైతులే కాదు పారిశ్రామికవేత్తలూ ఆత్మహత్య చేసుకుంటారన్నారు. అన్ని ఆత్మహత్యలు రైతు ఆత్మహత్యలుగానే చెప్పలేమన్నారు.

మైసూర్​లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో పాటిల్​ మాట్లాడుతూ… రైతులు మానసికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. వారి మరణాలకు ప్రభుత్వ విధానాలు కారణం కాదు. రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు, కార్యక్రమాలను తీసుకొచ్చాం. ఏ ఒక్క రైతు ఆత్మహత్య చేసుకోకూడదనేదే మా కోరిక. ప్రాణాలు కోల్పోయిన రైతులకు సంతాపం తెలిపేందుకు వారి ఇంటికి వెళ్లటం వల్ల ఆత్మహత్యలను ఆపలేమన్నారు.

రైతుల ఆత్మహత్యలు ఆపాలంటే వారి సంక్షేమం కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేయాలని పాటిల్ అన్నారు. మైసూర్​ లోని సీఎస్​ఐర్​ ఆధ్వర్యంలో ఆహార ప్రాసెసింగ్​కు ప్రోత్సాహం, సాంకేతిక నైపుణ్యాల పెంపు వంటి కార్యక్రమాలు ఈ కోవకే చెందుతాయన్నారు. కాగా, గత ఏడాది డిసెంబర్​ లో కూడా రైతు ఆత్మహత్యలపై పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రైతులు తమపై ఆధారపడిన వారి గురించి ఆలోచించకుండా వారి జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తారని ఆయన చేసిన వ్యాఖ్యాలపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే.