కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు..బీజేపీ దూకుడు

  • Published By: madhu ,Published On : December 9, 2019 / 08:06 AM IST
కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు..బీజేపీ దూకుడు

కర్నాటక ఉప ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 2019, డిసెంబర్ 09వ తేదీ సోమవారం ఉదయం ఓట్ల లెక్కింపును అధికారులు చేపట్టారు. ఇక్కడ బీజేపీ హావా కొనసాగిస్తోంది. 15 స్థానాలకు గాను 9 చోట్ల కమలం అభ్యర్థులు ఆధిక్యం కనబరుస్తున్నారు. కాంగ్రెస్ -3, జేడీఎస్ -2, ఇతరులు ఒక స్థానంలో ముందంజలో ఉన్నారు.

ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండడంతో నేతలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యడియూరప్ప సంతోషం వ్యక్తం చేశారు. కుమారుడు విజయేంద్రతో సంబరాలు జరుపుకున్నారు. ఒకరినొకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా విజయేంద్ర తండ్రి ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

ఓటమని అంగీకరిస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర మాజీ మంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. ఇందుకు బాధ పడాల్సిన అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. 
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య హర్షం వ్యక్తం చేశారు. సీఎం యడియూరప్ప నాయకత్వంలో కర్ణాటకలో బీజేపీ సుస్థిరమైన సమర్థవంతమైన పాలన అందించనుందని తెలిపారు. 
యడియూరప్ప ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ రావాలంటే ఆరు స్థానాల్లో బీజేపీ కచ్చితంగా గెలవాల్సిందే. 
ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బీజేపీకి పట్టం కట్టడంతో సీఎం యడియూరప్ప ధైర్యంగా ఉన్నారు. 

బీజేపీ, కాంగ్రెస్‌ మొత్తం 15 స్థానాల్లో… జేడీఎస్‌ 12చోట్ల బరిలో ఉన్నాయి.
డిసెంబర్ 5 వ తేదీన 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 66.25 శాతం పోలింగ్ నమోదైంది. 
224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలపై న్యాయస్థానాల్లో వ్యాజ్యాలుండటంతో రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగలేదు. 
దీంతో అసెంబ్లీలో మిగిలిన 222కుగాను మ్యాజిక్ నెంబర్ 112. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు
అనర్హతకు గురైన బీజేపీ తరపున ఎన్నికల బరిలో నిలబడిన రమేశ్ జార్ఖి హోళి గోకాక్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 

Read More : ఉల్లి దొంగను చితక్కొట్టేశారు : డిమాండ్ అలా ఉంది మరి