లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన…కరోనా హాట్ స్పాట్ లో రథోత్సవం

  • Published By: venkaiahnaidu ,Published On : April 17, 2020 / 10:46 AM IST
లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన…కరోనా హాట్ స్పాట్ లో రథోత్సవం

కరోనావైరస్ వ్యాప్తి నిరోధక చర్యల్లో భాగంగా విధించిన దేశవ్యాప్త లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘిస్తూ గురువారం కర్ణాటకలోని కల్బుర్గి జిల్లాలో నిర్వహించిన వార్షిక రథోత్సవంలో వందలాది భక్తులు పాల్గొన్నారు. కరోనా హాట్ స్పాట్ గా ఉన్న కలబుర్గిలోనే దేశంలోనే తొలి కరోనా మరణం నమోదైన విషయం తెలిసిందే. అలాంటి చోట ఇప్పుడు రథోత్సవం నిర్వహించడం,అందులో వందల మంది భక్తులు పాల్గొనడం ఇప్పుడు పెద్ద ఆందోళన కలిగిస్తోంది. సామాజిక దూరం(సోషల్ డిస్టెన్స్) పాటించాలనే నిబంధనని ఈ రథోత్సవంలో పూర్తిగా ఉల్లంఘించారు. 

సిద్ధలింగేశ్వరస్వామి ఉత్సవంలో భాగంగా కలబుర్గి జిల్లాలోని చిత్తాపూర్ అనే గ్రామంలో గురువారం ఈ రథోత్సవం జరిగింది. రెండేళ్ల చిన్నారికి కోవిడ్-19 సోకడంతో కంటైన్మెంట్ ఏరియాగా గుర్తించిన వాడి గ్రామానికి రథోత్సవం జరిగిన ప్రాంతం కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. గురువారం ఉదయం 6 గంటలకు ప్రారంభమైన రథోత్సవంలో 100 నుంచి 150 మంది పాల్గొని రథాన్ని లాగారు. దాదాపు 20 నిముషాలపాటు రథోత్సవం సాగిందని, లాక్‌డౌన్‌ నిబంధనలు పాటించని 20 మందికిపై కేసులు నమోదు చేశామని ఎస్పీ మార్టిన్ తెలిపారు. మత సంబంధ కార్యక్రమ నిర్వహణపై దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకోనందుకు చిత్తాపూర్ తాలూకా మెజిస్ట్రేట్‌, పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్‌లను విధుల నుంచి సస్పెండ్ చేశారు. 

ఈ రథోత్సవం ఘటనతో ఉక్కిరిబిక్కిరైన జిల్లా యంత్రాంగం రేవూర్ గ్రామంలో హడావుడిగా ఫీవర్ క్లినిక్‌లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయడానికి మేము బృందాలని పంపిస్తున్నామని, గ్రామాన్ని ఇప్పటికే సీల్ చేశామని కల్బుర్గి జిల్లా డిప్యూటీ కమిషనర్ చెప్పారు. వాడి గ్రామంలో కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలైనట్లు ఆయన తెలిపారు. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లఘించినందుకు టెంపుల్ ట్రస్ట్ సభ్యులతోపాటు మరో 19 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. ఇప్పటికే ఈ సంఘటనతో సంబంధం ఉన్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మార్టిన్ తెలిపారు. కాగా, రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ఒక్కరోజే 36 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసులు 315 చేరాయి. 13 మంది మృతి చెందారు. 82 మంది కోలుకున్నారు.

కొంత మంది పురోహితులు, ఆలయ అధికారుల సమక్షంలో బుధవారం సాయంత్రం ఆలయంలో కొన్ని నిత్య పూజలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు చెప్పారు. కానీ ఆ మరుసటి రోజు ఉదయమే ఆలయం బయటకి రథాన్ని తీసుకొచ్చి ఊరేగింపు నిర్వహించారు. ఇందులో సుమారు వెయ్యి మంది భక్తులు పాల్గొన్నారని ఒక అధికారి చెప్పారు. ఈ ఉత్సవాన్ని నిర్వహించడంలేదని అంతకు ముందే ఆలయ అధికారులు పత్రికా సమావేశం ద్వారా ప్రభుత్వానికి తెలియచేశారు. ప్రభుత్వ అధికారులు కూడా ఈ ఉత్సవం నిర్వహించవద్దని ఆలయ ట్రస్ట్ సభ్యులకి సమావేశాలు పెట్టి విజ్ఞప్తి చేశారని, చిత్తాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రియాంక్ ఖర్గే చెప్పారు.