Karnataka : CM గా యడియూరప్ప ఆఖరి ఉత్తర్వులు..ఉద్యోగులకు డీఏ పెంపు

సీఎం పదవికి రాజీనామా చేసినా ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యడియూరప్ప తన పదవి నుంచి తప్పుకునే క్రమంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.చివ‌రినిమిషంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. ఉద్యోగులకు డీఏను 10.25 శాతం పెంచుతూ ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు.

Karnataka : CM గా యడియూరప్ప ఆఖరి ఉత్తర్వులు..ఉద్యోగులకు డీఏ పెంపు

Yediyurappa Raised Da By 10.25% For Govt Employees

Yediyurappa Raised DA By 10.25% For Govt Employees : క‌ర్ణాటక సీఎంగా యడియూరప్ప రాజీనామా చేసిన విషయం తెలిసిందే. సీఎం పదవికి రాజీనామా చేసినా ఆప‌ద్ధ‌ర్మ ముఖ్య‌మంత్రిగా వ్య‌వ‌హ‌రిస్తున్న యడియూరప్ప తన పదవి నుంచి తప్పుకునే క్రమంలో ఉద్యోగులకు శుభవార్త చెప్పారు.చివ‌రినిమిషంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిసేలా చేశారు యడ్డీ. ఉద్యోగులకు డీఏను 10.25 శాతం పెంచుతూ ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీంతో ఉద్యోగుల మూల‌వేత‌నంలో డీఏ 21.50 శాతానికి పెరిగింది. ప్ర‌స్తుతం రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగుల డీఏ వారి మూల‌వేత‌నంలో 11.25 శాతంగా ఉంది.

కాగా యడియురప్ప సీఎంగా ఉన్న సమయంలో క‌ర్నాట‌క రాష్ట్ర ప్ర‌భుత్వోద్యోగుల సంఘం డీఏ పెంపుపై విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించారు. ఈక్రమంలో పలు కీలక పరిణామాల మధ్య యడియూరప్ప సీఎం పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అయినా తాను ఉద్యోగులకు ఇచ్చిన మాటను పదవి నుంచి దిగిపోయే సమయంలో నెరవేర్చారాయన. డీఏ పెంపు నిర్ణ‌యంతో ఆరు ల‌క్ష‌ల మంది రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, 4.5 ల‌క్ష‌ల మంది పెన్ష‌న‌ర్ల‌తో పాటు వివిధ‌ పీఎస్‌యూలు, కార్పొరేష‌న్ల‌లో ప‌నిచేసే దాదాపు మూడు ల‌క్ష‌ల మంది ఉద్యోగుల‌కు లబ్ధి చేకూర‌నుంది. క‌ర్నాట‌క‌లో య‌డియూర‌ప్ప పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన అనంతరం 2019 అక్టోబ‌ర్‌లో చివ‌రిసారిగా డీఏ పెంపు నిర్ణ‌యం తీసున్నారు. కాగా ఎన్నిసార్లు సీఎం అయినా ఆయన ఒక్కసారి కూడా పూర్తికాలం పదవిలో కొనసాగలేకపోయారు. ఈసారి అయినా ఆయన పూర్తికాలం సీఎంగా కొనసాగుతారనే అందరూ అనుకున్నారు. పేరులో మార్పులు చేసుకున్నా గానీ ఆయన మాత్రం పదవిని పూర్తిగా కొనసాగించుకోలేకపోయారు.

రాష్ట్రంలో సొంత పార్టీలోనే అసమ్మతి గళం వినిపిస్తున్న క్రమంలో యడ్డీ రాజీనామా చేయకపతప్పలేదు. కర్ణాటలో 2023లో ఎన్నికలు రానున్న క్రమంలో పార్టీలో నిరసనలు పెరగటం మంచిది కాదనుకున్న బీజేపీ అధిష్టానం ఎట్టకేలకు యడియూరప్పను సీఎం పదవి నుంచి తొలగించాల్సి వచ్చింది. ఈరోజు (జులై 27,2021) సాయంత్రానికి కొత్త సీఎం ఎవరు అనే దానిపై నిర్ణయం తీసుకోనుంది బీజేపీ అధిష్టానం.కర్ణాటక ముఖ్యమంత్రి కోసం కేంద్ర పెద్దలు చర్చలు ప్రారంభించారు. జేపీ నడ్డా, అమిత్‌షా, పార్లమెంటరీ వ్యవహారాలు, గనుల శాఖ మంత్రి ప్రహ్లోద్ జోషి ఢిల్లీలో రహస్య మంతనాలు జరుపుతున్నారు. బసవగౌడ రామన్‌గౌడ పాటిల్, అరవింద్ బెల్లాడ్, మురుగేష్ నిరాని పేర్లు సీఎం రేసులో ప్రధానంగా వినిపిస్తున్నాయి. మురుగేష్ నిరాని గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. పదవి దక్కించుకోవటానికే ఆయన ఆదివారం ఆయన ఢిల్లీ వెళ్లినట్లుగా సమాచారం.

కర్ణాటక హోం మంత్రి బసవరాజ్ బొమ్మై పేరు కూడా సీఎం రేసులో ఉన్న వారిలో ప్రముఖంగా వినిపిస్తోంది. గౌడ సామాజిక వర్గానికి అధిష్ఠానం ప్రాధాన్యం ఇస్తే కేంద్ర మాజీ మంత్రి డీవీ సదానంద గౌడ కానీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి సీటీ రవి కానీ తదుపరి సీఎం అయ్యే అవకాశాలున్నాయి. అదే సామాజిక వర్గానికి చెందిన వారిలో ఆర్.అశోక్, సిఎన్.అశ్వద్ధ నారాయణ కూడా రేసులో ఉన్నారు. అలాగే, గత రెండు వారాలుగా బీజేపీలో ”దళిత ముఖ్యమంత్రి” ప్రస్తావన కూడా వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి గోవింద్ కర్జోల్, బీ.శ్రీరాములు ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పేరు కూడా ప్రముఖంగానే వినిపిస్తోంది. సీఎం పదవికి గట్టి పోటీదారుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ పేరు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ ఆయన మాత్రం అదేమీలేదనే అంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కర్ణాటకకు కొత్త సీఎం ఎవరనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది.