Karnataka CM : కర్ణాటకకు కొత్త సీఎం..రాజీనామా సంకేతాలిచ్చిన యడియూరప్ప!

కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ గురువారం బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు.

Karnataka CM : కర్ణాటకకు కొత్త సీఎం..రాజీనామా సంకేతాలిచ్చిన యడియూరప్ప!

Yadiyurappa

Karnataka CM కర్ణాటక ముఖ్యమంత్రి రాజీనామాపై ఊహాగానాలు వెలువడుతున్న వేళ గురువారం బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. తన భవిష్యత్తుపై జులై 25న అధిష్ఠానం నిర్ణయం తీసుకుంటుందని యడియూరప్ప చెప్పారు. దీంతో జులై-26 తర్వాత తాను సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్లు యడియూరప్ప పరోక్ష సంకేతాలిచ్చారు.

గురువారం కర్ణాటక రాజధాని బెంగళూరులో సీఎం యడియూరప్ప మీడియాతో మాట్లాడుతూ..ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్​ షాకు తనపై ప్రత్యేకమైన ప్రేమ, నమ్మకం ఉన్నాయన్నారు. 75 ఏళ్లు నిండిన ఎవరికీ ఎలాంటి పదవులను బీజేపీ కట్టబెట్టలేదని తెలుసని.. కానీ, తన పనితీరు నచ్చి 78 ఏళ్ల వయసున్న తనకు సీఎంగా అవకాశం కల్పించారని యడియూరప్ప అన్నారు. తాను అధిష్ఠానం నిర్ణ‌యాన్ని అనుస‌రించి న‌డుచుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. అధిష్ఠానం నిర్ణ‌యం ఎలా ఉన్న‌ప్ప‌టికీ తాను పార్టీ బ‌లోపేతానికి కృషి చేస్తాన‌ని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీని మ‌రోసారి అధికారంలోకి తీసుకురావ‌డ‌మే త‌న ల‌క్ష్య‌మ‌ని తెలిపారు. పార్టీ కార్యకర్తలు తమ సందేహాలను వీడి, తనకు సహకరించాలని కోరారు. నిరసనలను వ్యక్తం చేస్తూ ఎవరూ ఎలాంటి ప్రకటనలు చేయవద్దని… అలాంటి వాటికి జోలికి వెళ్లకుండా తనతో సహకరించాలని యడియూరప్ప కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.

జులై 26న యడియూరప్ప ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో.. ఆ రోజున ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని యడియూరప్ప చెప్పారు. కాగా,ఈ నెల‌ 26 నాటికి నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉందని కొద్ది రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే యడియూరప్ప తాజా వ్యాఖ్యలు ఆ ఊహాగానాలకు బలం చూకూర్చేలా ఉన్నాయి.

కాగా, ఇటీవ‌ల ఢిల్లీకి వెళ్లిన య‌డియూర‌ప్ప బీజేపీ అధిష్ఠానాన్ని క‌లిసి చ‌ర్చలు జ‌రిపారు. ఆ సమయంలో సీఎం మార్పు గురించి తనకేమీ తెలియదని మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు, వీరశైవ లింగాయత్​ సామాజిక వర్గానికి చెందిన నేతలు, అనుచరులు సహా ఆల్​ ఇండియా వీర శైవ మహాసభ యడియూరప్పకు తమ మద్దతు ప్రకటించింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా యడియూరప్పను తొలగిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.