అసెంబ్లీలో చొక్కా విప్పిన కర్ణాటక ఎమ్మెల్యే

Karnataka కర్ణాటకకు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ గురువారం ఆ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో చొక్కా విప్పారు. చొక్కా విప్పి చేతిలో పట్టుకొని అధికార బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఆయనను సస్పెండ్ చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి బసవరాజ్ బొమ్మై ఓ తీర్మాణాన్ని పెట్టగా.. స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే కాంగ్రెస్ ఎమ్మెల్యే సంగమేష్ ను సభ నుంచి మార్చి-12వరకు సస్పెండ్ చేశారు.
కాగా, కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో భాగంగా గురువారం అసెంబ్లీ జరిగింది. పార్లమెంట్ ఎన్నికలతో కలిపి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు(ఒకే దేశం,ఒకే ఎన్నిక)నిర్వహించాలని సీఎం బీఎస్ యెడియూరప్ప ప్రభుత్వం భావిస్తున్నది. దీనిపై తీర్మానం కోసం అసెంబ్లీలో ఈ అంశంపై చర్చించాలని నిర్ణయించింది. స్పీకర్ దీని ప్రస్తావన తేవగానే..కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య ఈ అంశంపై గురువారం సభలో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ అజెండాను అమలు చేసేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోడియం పక్కనే ఉన్న భద్రవిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే బీకే సంగమేష్ తన చొక్కా విప్పి ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా సభలో నినాదాలు చేశారు. దీనిపై ఆగ్రహించిన స్పీకర్ విశ్వేశ్వర్ హెగ్డే ఆ ఎమ్మెల్యేను సభ నుంచి సస్పెండ్ చేశారు.
అయితే,సంగమేష్ తన చర్యను సమార్థించుకున్నారు. సస్పెండ్ కు గురైన తర్వాత అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడిన ఆయన..తనకు న్యాయం జరగట్లేదనే ఇలా చేశానన్నారు.నాకు న్యాయం జరగకుంటే ఇంకేం చేయాలి?గూండాయిజం వంటి చెడ్డ పనులు చేయలేదు.స్పీకర్ నన్ను ఎందుకు సస్పెండ్ చేశాడో వెళ్లి అడుగుతా అని సంగమేష్ అన్నారు. భద్రావతిలో రాజకీయంగా తనను ఎదర్కోలేక బీజేపీ..తనపై,తన కుటుంబసభ్యులపై పెట్టిన తప్పుడు వేధింపులు,హత్యాయత్నం కేసులకి సంబంధించి తాను స్పీకర్ కు లెటర్ ఇచ్చానని,అయితే దానికి ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదని సంగమేష్ తెలిపారు.