ఏ క్షణమైనా రైళ్లలో ఉగ్రదాడులు : దక్షిణాది రాష్ట్రాలకు వార్నింగ్

  • Published By: veegamteam ,Published On : April 27, 2019 / 02:35 AM IST
ఏ క్షణమైనా రైళ్లలో ఉగ్రదాడులు : దక్షిణాది రాష్ట్రాలకు వార్నింగ్

దక్షిణాది రాష్ట్రాలపై ఉగ్రవాదులు గురి పెట్టారా. దాడులు చేసేందుకు స్కెచ్ వేశారా. ఏ క్షణమైనా రైళ్లలో టెర్రర్ అటాక్ జరగొచ్చా. అంటే… కర్నాటక పోలీసులు అవుననే అంటున్నారు. శ్రీలంకలో మారణహోమం సృష్టించిన  ఉగ్రవాదులు దక్షిణాది రాష్ట్రాల్లో దాడులకు స్కెచ్ వేశారని కర్నాటక డీజీపీకి సమాచారం అందింది. కర్నాటక డీజీపీకి ఓ అజ్ఞాత వ్యక్తి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. తమిళనాడు, కర్నాటక, కేరళ, ఏపీ, తెలంగాణ, గోవా,  మహారాష్ట్రతో పాటు కేంద్రం పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఉగ్రదాడులు జరగొచ్చని ఆ ఫోన్ చేసి వ్యక్తి చెప్పాడని కర్నాటక డీజీపీ తెలిపారు. అది కూడా రైళ్లలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశముందని  చెప్పాడట. వెంటనే అలర్ట్ అయిన కర్నాటక డీజీపీ.. ఆ ఏడు రాష్ట్రాల డీజీపీలకు కాల్ చేశారు. ఏ క్షణమైనా ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

19 ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశముందని, అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక డీజీపీ వార్నింగ్ ఇచ్చారు. కర్నాటక డీజీపీ హెచ్చరికలతో రైలు ప్రయాణం చేయాలంటే జనాలు హడలిపోతున్నారు. తమిళనాడు రాష్ట్రం  రామనాథపేరంలో 19మంది ఉగ్రవాదులు ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు డీజీపీకి ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారు. ఏ క్షణమైనా దాడి చేసే అవకాశం ఉందని  హెచ్చరించారు. అప్రమత్తమైన పోలీసులు హోటళ్లు, లాడ్జిలు, బస్టాండ్ లు, రైల్వే స్టేషన్లలో ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.