రైస్ కావాలని అడిగిన రైతుని చచ్చిపొమ్మన్న కర్ణాటక మంత్రి కత్తి ఉమేష్

రైస్ కావాలని అడిగిన రైతుని చచ్చిపొమ్మన్న కర్ణాటక మంత్రి కత్తి ఉమేష్

Karnataka Minister Asks Farmer To Go Die Then A Bizarre Defence

Karnataka Minister పీడీఎస్(పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్)రైస్ కేటాయింపు విషయమై ప్రశ్నించిన ఓ రైతుపై కర్ణాటక ఆహార మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉమేష్ కత్తి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రూపుతున్నాయి. రైతుకి-మంత్రికి మధ్య జరిగిన సంభాషణకు సంబంధించిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాష్ట్రప్రభుత్వం నెలకు 2కేజీల రైస్ ఇస్తోంది. ఇది మాకు ఎలా సరిపోతుంది?అని రైతు ప్రశ్నించగా…ప్రభుత్వం 3కిలోల రాగి కూడా ఇస్తోంది అని మంత్రి సమాధానమిచ్చారు. అయితే,ఉత్తర కర్ణాటకలో ఇది అందుబాటులో లేదని రైతు వాదించగా..ఉత్తర కర్ణాటకలో ప్రభుత్వం తయారీ జొన్నరొట్టే మరియు రైస్ సరఫరా చేస్తోందని మంత్రి సమాధానమిచ్చారు.

అప్పుడు రైతుకి-మంత్రి మధ్య ఫోన్ సంభాషణ
రైతు : సర్, అది సరిపోతుందా?ఇప్పుడు లాక్ డౌన్ మరియు జీవనోపాధి లేదు. అది సరిపోతుందా సార్?
మంత్రి : ప్రతి నెలా, కేంద్రప్రభుత్వం 5 కేజీలు(గోధుమ లేదా రైస్)లాక్ డౌన్ లో ఇస్తోంది. మే మరియు జాన్ నెలలో..
రైతు : ఎప్పుడు ఇస్తున్నారు?
మంత్రి : వచ్చే నెలలో
రైతు :అప్పటివరకు మేము ఆకలితో ఉండాలా లేక చావాలా?
మంత్రి : చనిపోవడం మంచిది. నిజానికి,మేము ఇవ్వడం ఆపడానికి కారణం అదే. దయచేసి నాకు ఫోన్ చేయొద్దు.

మంత్రి గారి సమాధానం విని రైతుతో సహా అందరూ షాక్ అయ్యారు. మంత్రి వ్యాఖ్యలపై విపక్షాల నుంచే కాకుండా నెటిజన్ల నుంచి కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అన్నివైపుల నుంచి విమర్శలు వ్యక్తమవడంతో మంత్రిగారు తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. నేను చావాలా అని రైతు అడిగినప్పుడు నేను ఏం చెప్పాలి?సరిగ్గా అడిగితే,సరైన పద్దతిలో నేను స్పందించేవాడిని అని మంత్రి ఉమేష్ కత్తి బుధవారం విలేకరుతో మాట్లాడుతూ అన్నారు. అయితే,అక్కడున్న మీడియా ప్రతినిధులు…నువ్వు చనిపోవద్దు.ప్రభుత్వం మీకు సాయం చేస్తుంది అని రైతుకి మీరు సమాధానం ఇచ్చి ఉండవచ్చు కదా అని మంత్రిగారిని ప్రశ్నించగా…నాకు అంతపెద్ద హృదయం లేదు,నాది చాలా చిన్న హార్ట్ అని మంత్రి సమాధానమిచ్చారు. మరోవైపు,వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కర్ణాటక సీఎం యడియూరప్ప మంత్రి ఉమేష్ కత్తిని మందలించినట్లు సమాచారం.

కాగా,మంత్రి ఉమేష్ కత్తి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. మార్చి-31లోగా టీవీలు,టూ వీలర్లు ఉన్న కుటుబాలు తమ బీపీఎల్ కార్డులను సరెండర్ చేయాలని లేకుంటే చర్యలు తప్పవు అని ఫిబ్రవరిలో మంత్రిగారు తీసుకున్న వివాదాస్పద నిర్ణయం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే.సొంతపార్టీ నేతలు కూడా మంత్రిగారిపై విమర్శలు గుప్పించారు. అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో అప్పుడు మంత్రి తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు.