mutant strain : మొన్న మహారాష్ట్ర, గుజరాత్, నేడు కర్నాటకలో నైట్ కర్ఫ్యూ

mutant strain : మొన్న మహారాష్ట్ర, గుజరాత్, నేడు కర్నాటకలో నైట్ కర్ఫ్యూ

Karnataka Night Curfew  : ప్రపంచానికి మరోసారి కరోనా టెన్షన్ పెడుతోంది. తగ్గుముఖం పడుతున్న క్రమంలో..కరోనా కొత్తరకం స్ట్రెయిన్ కలవర పెడుతోంది. ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా అలర్ట్ అయిపోయాయి. కఠిన నిబంధనలు, ఆంక్షలు విధిస్తున్నాయి. బ్రిటన్ నుంచి విమాన సర్వీసులను తాత్కాలికంగా బ్రేక్ వేశాయి. యూకే నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన..వారిలో 20 మందికి కరోనా పాజిటివ్ రావడంతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పలు రాష్ట్రాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే..కర్నాటక రాష్ట్ర ప్రభుత్వం రాత్రి వేళ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించేసింది.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా కొత్త స్ట్రెయిన్‌తో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి పూట కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. 2020, డిసెంబర్ 23వ తేదీ బుధవారం రాత్రి 10 గంటల నుంచి అమలులోకి రానున్న కర్ఫ్యూ నిబంధనలు.. ఉదయం 6 గంటల వరకూ కొనసాగుతాయి. జనవరి 2 వరకూ ఈ కర్ఫ్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ స‌హ‌క‌రించాల‌ని కర్నాటక సీఎం యెడియూర‌ప్ప కోరారు.

ఇప్పటికే మహారాష్ట్రతో పాటు, గుజరాత్‌లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి కర్ఫ్యూ కొనసాగుతండగా..ఇప్పుడు కర్నాటక కూడా అదే నిర్ణయం తీసుకుంది. మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే..రాత్రి 10 గంటల తర్వాత..ఎలాంటి వేడులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఎవరూ బయట తిరొగద్దని, రానున్న క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపింది.