9నెలల తర్వాత కర్నాటకలో తెరుచుకున్న స్కూళ్లు.. జ్వరం ఉంటే ఇంటికే!

9నెలల తర్వాత కర్నాటకలో తెరుచుకున్న స్కూళ్లు.. జ్వరం ఉంటే ఇంటికే!

Karnataka schools reopen for students : కరోనా మహమ్మారి వ్యాప్తితో మూతపడిన కర్నాటకలో స్కూళ్లు తెరుచుకున్నాయి. 9 నెలల తర్వాత స్కూళ్లు రీఓపెన్ అయ్యాయి. మార్చి 2020 నుంచి లాక్ డౌన్ విధించినప్పటినుంచి స్కూళ్లు మూతపడ్డాయి. కొత్త సంవత్సరం నుంచి కర్నాటకలో ప్రభుత్వ స్కూళ్లు మళ్లీ తెరుచుకున్నాయి. స్కూల్ క్యాంపస్ లోకి ఎంట్రీ కావాలంటే ముందుగా విద్యార్థులందరూ తప్పనిసరిగా తమ టెంపరేచర్ చెకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే క్యాంపస్ లోకి అనుమతించనున్నారు. అంతేకాదు.. మాస్క్ లు ధరించడంతో పాటు చేతులను శానిటైజ్ చేసుకోవాలి. స్కూల్ క్యాంపస్ ప్రాంగణాల్లో ఎంట్రీ గేట్ దగ్గర శానిటైజేషన్ డెస్క్ ఏర్పాటు చేశారు.

స్కూల్లోకి వచ్చే విద్యార్థులు ముందుగా టెంపరేచర్ చెకింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో ఎవరికైనా జ్వరం లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వారిని తిరిగి ఇంటికి పంపేస్తామని బెంగళూరులోని ప్రభుత్వ స్కూళ్లో టీచర్ ఒకరు పేర్కొన్నారు. ఈ ఏడాది ఆరంభంలో నిర్వహించే పరీక్షల్లో కూడా కోవిడ్ నిబంధనల ప్రకారమే ఏర్పాట్లు చేయనున్నట్టు తెలిపారు. కొన్ని ప్రైవేటు స్కూళ్లు కూడా శుక్రవారం నుంచే తెరవాలని నిర్ణయించాయి. కానీ, కొన్ని స్కూళ్లు యాజమాన్యాలు మాత్రం ఆన్ లైన్ క్లాసులే కొనసాగించాలని నిర్ణయించాయి.

ఈ విద్యా సంవత్సరంలో మిగతా ప్రైవేటు స్కూళ్ల మాదిరిగా కర్నాటకలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ ఆన్ లైన్ క్లాసులను నిర్వహించడం లేదు. కర్నాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యాగామా స్కీమ్ అనే కమ్యూనిటీ లెర్నింగ్ స్కీమ్‌ను గత ఏడాది అక్టోబర్ నెలలో నిలిపివేసింది. ఆ నెలలో టీచర్లు, విద్యార్థుల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో ప్రభుత్వం పథకాన్ని నిలిపివేసింది. మరోవైపు కర్నాటకలో తెరుచుకున్న స్కూళ్లను విద్యాశాఖ మంత్రి సురేశ్ కుమార్ సందర్శించారు. మొదటి రోజు తరగతులు ఎలా జరుగుతున్నాయి, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఎలాంటి చర్యలు చేపడుతున్నారో ఆయన పరిశీలించారు.