1600కోట్ల లాక్ డౌన్ రిలీఫ్ ప్యాకేజీ..దోభీలు,బార్బర్లకు 5వేలు ప్రకటించిన యడియూరప్ప

  • Published By: venkaiahnaidu ,Published On : May 6, 2020 / 01:53 PM IST
1600కోట్ల లాక్ డౌన్ రిలీఫ్ ప్యాకేజీ..దోభీలు,బార్బర్లకు 5వేలు ప్రకటించిన యడియూరప్ప

కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ కారణంగా తీవ్రంగా నష్టపోయిన వివిధ సెక్టార్లకు సహాయం చేసేందుకు 1,600 కోట్ల రూపాయల రిలీఫ్ ప్యాకేజీని ప్రకటించారు కర్ణాటక సీఎం యడియూరప్ప. లాక్‌డౌన్ కారణంగా మధ్య తరగతి, చిన్న తరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయని, అందుకోసం 1,600 కోట్ల రూపాయాలను ప్యాకేజీ రూపంలో ప్రకటించినట్లు యడియూరప్ప సర్కార్ తెలిపింది.

ఈ ప్యాకేజీతో మధ్య తరగతి, చిన్న తరహా పరిశ్రమలు, చేనేతలు, పూల తోటలు పెంచేవారు, దోభీలు, క్షౌరవృత్తి నిర్వహించే వారు లాభపడతారని అధికారులు తెలిపారు. కోవిడ్ కేవలం రైతులను మాత్రం నష్టపరచలేదు. దోభీలు, క్షురకులు… ఇలా ఇతర వృత్తుల వారిని కూడా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దీనిని దృష్టిలో పెట్టుకుని వారికి ఓ ప్యాకేజీని ప్రకటించాలని నిర్ణయం తీసుకున్నాం అని సీఎం యడియూరప్ప ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. 

పంట నష్టానికి గరిష్టంగా పూల అమ్మకం దారులకు హెక్టారుకు రూ. 25,000 ఉపశమనం లభిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని 60,000మంది దోభీలకు, 2,30,000మంది క్షురకులకు 5,000 రూపాయలు లభిస్తాయని ప్రభుత్వం తెలిపింది ఇక రాష్ట్రంలోని 7,75,000మంది ఆటో, టాక్సీ డ్రైవర్లకు రూ.5,000, నిర్మాణ కూలీలకు గతంలో ఇచ్చిన రెండు వేల రూపాయలతో పాటు మూడు వేల రూపాయలను అదనంగా ఇస్తున్నట్లు యడియూరప్ప తెలిపారు.

లాక్ డౌన్ కారణంగా ప్రొడక్షన్ లాస్ తో తీవ్రంగా నష్టపోయిన సూక్ష్మ,చిన్న,మధ్యతరహా పరిశ్రమలు(MSMEs)కోలుకునేందుకు..వాళ్ల కరెంట్ బిల్లులలో నెలవారీ ఫిక్స్డ్ ఛార్జీలను 2నెలలు మాఫీ చేస్తున్నట్లు యడియూరప్ప ప్రకటించారు. అదేవిధంగా, పెద్ద పరిశ్రమల విద్యుత్ బిల్లులలో స్థిర ఛార్జీల చెల్లింపు 2నెలల కాలానికి జరిమానా మరియు వడ్డీ లేకుండా వాయిదా వేయబడింది.

మరోవైపు, రాష్ట్రంలో కనస్ట్రక్షన్ కార్యకలాపాల పునరుద్దరణకు వర్కర్లు అవసరమని వలసకూలీలను తరలించేందుకు వేసిన స్పెషల్ రైళ్లను మంగళవారం నుంచి యడియూరప్ప సర్కార్ నిలిపివేయడంపై విపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. యడియూరప్ప సర్కార్ వలసకూలీలను తమ స్వస్థలాలకు వెళ్లనీయకుండా బలవంతంగా ఉన్నచోటే ఉంచుతుందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.