కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవం : మన్మోహన్‌కు పాక్ ఆహ్వానం

  • Published By: madhu ,Published On : September 30, 2019 / 11:32 AM IST
కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవం : మన్మోహన్‌కు పాక్ ఆహ్వానం

కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాన మంత్రి మోడీని కాదని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్‌కు పాక్ ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ప్రాముఖ్యత కలిగిన కారిడార్ ప్రారంభించడంపై చర్చ జరిగిందని, సంప్రదింపుల అనంతరం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఆహ్వానించాలని నిర్ణయించుకున్నట్లు ఖురేషీ వెల్లడించారు.

అధికారిక ఆహ్వానం పంపుతామన్నారు. సింగ్‌కు మత విశ్వాసం ఉందని..ఆయనకు పాక్‌లో ఎంతో గౌరవం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. గురునానక్ దేవ్ 550 వ జయంతి సందర్భంగా నవంబర్‌లో కారిడార్ ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు. 

గురు నానక్ దేవ్ చివరి విశ్రాంతి స్థలం దర్బార్ సాహిబ్..పంజాబ్‌లోని గురుదాస్ పూర్ జిల్లాలోని డేరా బాబా నానక్ మందిరంతో అనుసంధానించాలని నిర్ణయించి కర్తార్ పూర్ కారిడార్‌ నిర్మాణం చేపట్టాయి పాక్ – భారత్ ప్రభుత్వాలు. డేరాబాబ నానక్ మసీదుతో పాక్‌లోని కర్తార్ పూర్‌కు అనుసంధానం చేస్తారు. రావి నదీ తీరంలోని కర్తార్ పూర్‌కు భారత యాత్రీకులు వీసా లేకుండానే ఎంట్రీకి అనుమతినిస్తారు.

పాక్ – భారత సరిహద్దు నుంచి కర్తార్ పూర్‌లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ వరకు కారిడార్ నిర్మిస్తున్నారు. గురుదాస్ పూర్‌లోని డేరా బాబా నానక్ నుంచి సరిహద్దు వరకు మరొక భాగం నిర్మితమౌతోంది. ఇదిలా ఉంటే..ఆర్టికల్ 370 రద్దు, జమ్మూలో నెలకొన్న పరిస్థితులపై పాక్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు దేశాల మధ్య మాటల తూటాలు పేలుతున్న సమయంలో పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వివాదం మరింత రాజేస్తోంది.