కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభించిన మోడీ..ఇమ్రాన్ కు థ్యాంక్స్

  • Published By: venkaiahnaidu ,Published On : November 9, 2019 / 09:15 AM IST
కర్తార్ పూర్ కారిడార్ ప్రారంభించిన మోడీ..ఇమ్రాన్ కు థ్యాంక్స్

సిక్కు మత వ్యవస్థాపకుడు గురునానక్‌ 550వ జయంతి సందర్భంగా పంజాబ్ లోని గురుదాస్ పూర్ లోని డేరాబాబా నానక్ దగ్గర భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ఇవాళ(నవంబర్-9,2019) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్,పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్,కేంద్రమంత్రులు హర్ దీప్ సింగ్ పూరీ, హర్ సిమ్రత్ కౌర్ బాదల్,నటుడు,గురుదాస్ పూర్ ఎంపీ సన్నీడియోల్ సహా పలువురు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డేరాబాబా నానక్ గురుద్వారాకు 8కిలోమీటర్ల దూరంలోని బీఎస్ఎఫ్ క్యాంప్ దగ్గర ప్రధాని మోడీ మాట్లాడుతూ.. గురునానక్‌ 550వ జయంతికి ముందుగానే కర్తార్‌పూర్‌ కారిడార్‌ను ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు సహకరించిన పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.

ఇమ్రాన్‌ ఖాన్‌ భారతీయుల సంప్రదాయాలను గౌరవించడం మంచి పరిణామం అని మోదీ పేర్కొన్నారు. శ్రీ గురు నానక్ దేవ్ జీ ఆశీర్వాదం, ప్రభుత్వ దృఢ నిశ్చయంతో కార్తార్ పూర్ కారిడార్ ఓపెన్ చేయబడిందని మోడీ అన్నారు. వేలాది మంది ప్రజలు పవిత్ర తీర్థయాత్రకు వెళతారని ఆయన అన్నారు కర్తార్‌పూర్‌ కారిడార్‌ ప్రారంభోత్సవానికి కృషి చేసిన పంజాబ్‌ ప్రభుత్వం, శిరోమణి గురుద్వార ప్రబంధక్‌ కమిటీకి కూడా మోడీ ధన్యవాదాలు చెప్పారు. ఈ నెల 12వ తేదీన గురునానక్ 550వ జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.

సిక్కుల మ‌త గురువు గురు నాన‌క్‌కు చెందిన గురుద్వారా ద‌ర్బార్ సాహిబా ప్ర‌స్తుతం పాకిస్థాన్‌లో ఉన్న‌ది. అయితే ప్ర‌తి రోజూ 5 వేల మంది సిక్కులు ఆ గురుద్వార్ కు వెళ్లేందుకు పాక్ అనుమ‌తి ఇచ్చింది. గురు నాన‌క్ త‌న చివ‌రి 18 ఏళ్ల జీవితాన్ని గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లోనే గ‌డిపారు. పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్సులో ఉన్న న‌రోవ‌ల్ జిల్లాలో ఈ గురుద్వారా ఉన్న‌ది. ఇది అంత‌ర్జాతీయ స‌రిహ‌ద్దుకు కేవ‌లం నాలుగు కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న విషయం తెలిసిందే.