Kartarpur Corridor : సిక్కులకు కేంద్రం శుభవార్త..కర్తార్‌పూర్‌ కారిడార్‌ రీఓపెన్ పై షా ట్వీట్

సిక్కులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం(నవంబర్-17,2021)నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తిరిగి తెరవాలని మోదీ సర్కార్

Kartarpur Corridor : సిక్కులకు కేంద్రం శుభవార్త..కర్తార్‌పూర్‌ కారిడార్‌ రీఓపెన్ పై షా ట్వీట్

Kartarpur

Kartarpur Corridor : సిక్కులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. బుధవారం(నవంబర్-17,2021)నుంచి కర్తార్‌పూర్‌ కారిడార్‌ను తిరిగి తెరవాలని మోదీ సర్కార్ నిర్ణయించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఓ ట్వీట్‌లో తెలిపారు. గురునానక్ దేవ్, సిక్కు కమ్యూనిటీ పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న ఆరాధనాభావాన్ని ఈ నిర్ణయం చాటుతోందని అమిత్‌షా ఆ ట్వీట్‌లో తెలిపారు.

కాగా,పంజాబ్‌ బీజేపీ నేతలు గత ఆదివారం ప్రధాని మోదీని కలుసుకుని గురుపూరబ్‌కు ముందే కర్తార్‌పూర్ కారిడార్‌ను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఈనెల 19న గురునానక్ జయంతిని గురుపూరబ్‌గా జరుపుకొంటారు. పంజాబ్ సీఎం చ‌ర‌ణ్‌జీత్‌సింగ్ చ‌న్నీ స్వ‌యంగా ప్ర‌ధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను క‌లిసి కూడా విజ్ఞ‌ప్తి చేశారు. పంజాబ్ ఎన్నికలు దగ్గరపడుతుండటం, కర్తాక్‌పూర్ సాహిబ్‌ కారిడార్‌ను తెరవాలంటూ కాంగ్రెస్, అకాలీదళ్ సహా అన్ని పార్టీలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కేంద్రం తాజా నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.

క‌ర్తార్‌పూర్ కారిడార్‌ను పునఃప్రారంభించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాన్ని పంజాబ్ పీసీసీ చీఫ్ న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ స్వాగ‌తించారు. కారిడార్ పునఃప్రారంభం గురునాన‌క్ దేవ్‌ భ‌క్తుల‌కు అమూల్య‌మైన బ‌హుమానం అని ఆయ‌న‌ చెప్పారు. పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించారు. కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్‌ను సకాలంలో తెరిచినందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు అమరీందర్ సింగ్. గురు నానక్ దేవ్‌ జీ గురు పరబ్ సందర్భంగా ఈ పవిత్ర క్షేత్రంలో పూజలు చేసేందుకు వేలాది మంది భక్తులకు అవకాశం దొరుకుతుందని అమరీందర్ పేర్కొన్నారు.

అయితే, పాకిస్తాన్‌లోని కర్తార్‌పూర్‌లో ఉన్న గురుద్వారా దర్బార్‌ సాహిబ్‌ సిక్కులకు పవిత్ర పుణ్యక్షేత్రం. పాకిస్తాన్ లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లోని రావి నది ఒడ్డున ఉన్న కర్తార్‌పూర్‌ సాహిబ్‌ గురుద్వారా భారత సరిహద్దు నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది. సిక్కులకు ఆరాధ్య దైవమైన గురునానక్‌ తల్లిదండ్రులు ఇక్కడే మరణించగా.. బాబా గురునానక్‌ తన జీవితం చివరి రోజుల్లో ఇక్కడే కాలం గడిపారు. కర్తార్‌పూర్ గురుద్వారా యాత్రను కోవిడ్ కారణంగా 2020 మార్చిలో సస్పెండ్ చేశారు.

ఇదిలా ఉండగా.. గురునానక్‌ గురుపూరబ్‌ (జయంతి) ఈ నెల 19న జరుగనున్న సందర్భంగా 1500 మంది భారతీయ సిక్కు యాత్రికులకు పాక్‌కు వెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. భారత్‌-పాక్‌ మధ్య 1974 ద్వైపాక్షిక ప్రోటోకాల్స్‌ మేరకు నవంబర్‌ 17-26 మధ్య యాత్రికులు అత్తారి – వాఘా ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్ట్‌ ద్వారా పాక్‌లో ఉన్న గురుద్వారాను సందర్శిస్తారని విదేశాంగ శాఖ తెలిపింది.

ALSO READ China Overtakes U.S : ప్రపంచంలో నెం.1 సంపన్న దేశంగా చైనా..తాజా రిపోర్ట్ లో కీలక విషయాలు