భారత్ తో కశ్మీరే మా సమస్య..చర్చలతోనే పరిష్కారం : పాక్ ప్రధాని

భారత్ తో కశ్మీరే మా సమస్య..చర్చలతోనే పరిష్కారం : పాక్ ప్రధాని

Kashmir భారత్ – పాక్ మధ్య ఉన్న సమస్య కేవలం కశ్మీరేనని, భారత్ తో తమకున్న వివాదాలు దానిపైనేనని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఆ సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. శ్రీలంకకి రెండు రోజుల పర్యటన కోసం వెళ్లిన ఇమ్రాన్ ఖాన్‌… కొలంబోలో శ్రీలంక–పాకిస్తాన్ వాణిజ్యం మరియు పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యారు. శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్సతో కలిసి సమావేశంలో మాట్లాడారు. కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీలంకలో పర్యటించిన మొదటి దేశాధినేత ఇమ్రాన్ ఖాన్.

ప్రాంతీయ వివాదాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకోవాలన్నది తమ అభిమతమని ఈ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ…మా(భారత్-పాక్)మధ్య ఉన్న వివాదం కశ్మీర్ మాత్రమే. కేవలం చర్చల ద్వారా మాత్రమే ఆ సమస్యను పరిష్కరించుకోగలం. 2018లో నేను పాకిస్తాన్ లో ప్రధానిగా అధికారం చేపట్టిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఉపఖండంలో వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ప్రతిపాదించాను. అయితే, ఆ విషయంలో నేను విఫలమయ్యాను. ఎప్పటికైనా చర్చల ద్వారా సమస్య పరిష్కారమవుతుందని ఆశాభావంతో ఉన్నాను. వాణిజ్య, వర్తక సంబంధాలను మెరుగుపరచడం ద్వారానే ఉపఖండంలో పేదరికాన్ని రూపుమాపగలమని పాక్ ప్రధాని అన్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కశ్మీర్‌ వివాదం పరిష్కరించాలని పాక్‌ కోరుకుంటోందని..భారత్‌తో తాము శాంతి కోరుకుంటున్నామని ఇమ్రాన్‌ ఖాన్‌ అన్నారు.

ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించిన భారత విదేశాంగ శాఖ…చర్చలపై భారత్ ది కూడా ఒకే ఒక్క మాట. పాక్ తో మంచి సంబంధాలనే మేమూ కోరుకుంటాం. కానీ, ఉగ్రవాద నిర్మూలన, యుద్ధ వాతావరణం, హింస లేకుండా చూసినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపింది. సరిహద్దుల్లో కాల్పుల విరమణ పాటిస్తూ ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని చిత్తశుద్ధితో చేపడితేనే పాకిస్తాన్‌తో చర్చలకు అవకాశం ఉంటుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ చెప్పారు.

కాగా, ఈ వారం ప్రారంభంలో ఇమ్రాన్ ఖాన్ విమానం భారత గగనలతం మీదుగా కొలంబో వెళ్లేందుకు భారత అధికారులు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. అయితే,గతంలో భారత ప్రధాని మోడీ విమానం పాక్ గగనతలం మీదుగా సౌదీ వెళ్లేందుకు పాక్ అధికారులు అనుమతివ్వని విషయం తెలిసిందే.