కశ్మీర్ వెళ్లిపోవాలంటూ జర్నలిస్ట్ పై దాడి

  • Published By: vamsi ,Published On : February 23, 2019 / 06:31 AM IST
కశ్మీర్ వెళ్లిపోవాలంటూ జర్నలిస్ట్ పై దాడి

పుల్వామా టెర్రర్ ఎటాక్ అనంతరం దేశంలోని కొందరు వ్యక్తులు.. కశ్మీరీలపై దాడులు చేస్తూ  కలకలం సృష్టిస్తున్నారు. దేశంలో పలు చోట్ల ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి. అయితే తాజాగా  మహారాష్ట్రలోని పూణెలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. జమ్ముూకశ్మీర్ కు చెందిన 24 ఏళ్ల జర్నలిస్ట్ జిబ్రాన్ నజీర్ ను ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా కొట్టారు. స్థానికంగా ఉన్న ఓ వార్తాపత్రికలో నజీర్ పని చేస్తుండగా.. గురువారం రాత్రి సమయంలో అతనిపై ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిబ్రాన్ నజీర్ తన నివాసానికి బైక్ పై వెళుతున్న సందర్భంలో ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఈ దాడి చోటుచేసుకుంది.

దాడి జరిగిన వెంటనే జిబ్రాన్.. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. దాడికి పాల్పడిన అజారుద్దీన్ షేక్, దత్తాత్రేయ లవాతేలపై కేసు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా నజీర్ మాట్లాడుతూ, తనను కశ్మీర్ తిరిగి వెళ్లిపోవాలని దాడి చేసిన వ్యక్తులు కొట్టే ససమయంలో చెప్పారని,  తన బైక్ హిమాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ పై ఉండటంతో ఆ రాష్ట్రానికి వెళ్లాలంటూ అన్నారని, అయితే తనది జమ్ముకశ్మీర్ అని చెప్పడంతో కశ్మీర్ కు పోయి అక్కడ పనిచేసుకోవాలంటూ దాడి చేసినట్లు తెలిపాడు.

తన ఫోన్ ను లాక్కుని, బైక్ ను ధ్వంసం చేశారని చెప్పాడు.  అయితే, ఇది ముందుగా ప్లాన్ చేసుకుని చేసిన దాడి కాదని జిబ్రాన్ తెలిపాడు. అయితే దాడి అనంతరం పోలీస్ స్టేషన్ లో జిబ్రాన్ నజీర్ కు ఇద్దరు వ్యక్తులు క్షమాపణలు చెప్పారు. దాంతో వారిని క్షమించి నజీర్ కేసును వెనక్కు తీసుకున్నారు.