కేరళ అసెంబ్లీ పోల్స్ : ప్రజల అభిమానం ఎటువైపు

కేరళ అసెంబ్లీ పోల్స్ : ప్రజల అభిమానం ఎటువైపు

Kerala 140 Seats

Kerala Assembly Polls : కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ఎవరిదీ… అధికార ఎల్‌డీఎఫ్‌ పరిస్థితి ఎలా ఉంది… ప్రజల అభిమానంతో మరోసారి అధికారంలోకి వస్తుందా… గత ఎన్నికల్లో చిత్తుగా ఓడిన యూడీఎఫ్‌… ఈసారి గెలుస్తుందా…? అధికారం కోసం సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న కమలం కల నెలవేరుతుందా… ? ఇప్పుడు ఇదే హాట్‌ టాపిక్‌.. మలయాళీలు ఎవరికి ఓటు వేయనున్నారనేదే ఇప్పుడు అందరి మదిలో ఉన్న ప్రశ్న…

140 అసెంబ్లీ స్థానాలు : –
కేరళ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళ అసెంబ్లీకి ప్రతిసారి విలక్షణ తీర్పు ఇవ్వడం అక్కడి ఓటర్ల ప్రత్యేకత. మధ్యలో రెండుసార్లు మినహా ప్రతిసారీ LDF, UDFల మధ్య అధికారం చేతులు మారుతోంది. ఇక 1977 నుంచి తీసుకుంటే ఓసారి UDF గెలిస్తే తర్వాత LDF గెలిచేది. వరుసగా రెండుసార్లు ఎవ్వరికీ ఓటర్లు అధికారం కట్టబెట్టలేదు. గత ఎన్నికల్లో ఇక్కడ లెఫ్ట్‌ కూటమి ఘన విజయం సాధించింది. ఈసారి ఎలాగైనా గెలిచి ఆ సంప్రదాయాన్ని పోగొట్టాలని LDF పట్టుదలతో ఉంటే ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF ప్రయత్నాలు చేస్తోంది.
కేరళలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్….LDF మరోసారి విజయం సాధిస్తుందని కొన్ని ప్రీపోల్ సర్వేలు చెబుతున్నాయి. ఓ సర్వే ప్రకారం మొత్తం 140 అసెంబ్లీ సీట్లలో… 72 నుంచి 78 సీట్లను LDF గెలుచుకుంటుందని ఇక యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్…. UDF 59 నుంచి 65 సీట్లను గెలుచుకుంటుందనీ… 3 నుంచి 7 సీట్లు బీజేపీకి దక్కుతాయని అంచనా వేసింది. ఈ సర్వే ఇప్పుడు కేరళలో హాట్ టాపిక్ అయ్యింది.

పార్టీల వ్యూహాలు: –
140 స్థానాలున్న కేరళ 14వ శాసనసభ గడువు జూన్‌ 1తో ముగియనుంది. గత ఎన్నికల్లో వామపక్షాల నేతృత్వంలోని LDF, కాంగ్రెస్ నేతృత్వంలోని UDFపై భారీ మెజారిటీతో విజయం సాధించింది. అయితే ఈసారి ఎలాగైనా అధికారం కోసం కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. వాయనాడ్ ఎంపీ రాహుల్‌గాంధీ కేరళలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని UDF 19స్థానాలు నెగ్గగా… లెఫ్ట్‌ కూటమికి కేవలం ఒక్క ఎంపీ సీటు మాత్రమే దక్కింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అదే తరహా ఫలితాలు రావాలని కాంగ్రెస్ కోరుకుంటోంది. అయితే నేతల మధ్య దూరం పార్టీకి ఇబ్బందికరంగా మారింది. ఓ వర్గం ఉమెన్‌చాందీకి మద్దతుగా నిలుస్తుంటే మరో వర్గం ప్రతిపక్ష నేత రమేశ్‌ చెన్నితాల వైపు ఉంది. దీంతో ఈసారి ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

బీజేపీకి ఒక్క సీటు : –
ఇక గత ఎన్నికల్లో బీజేపీ ఇక్కడ కేవలం ఒక్కసీటుకే పరిమితమైంది. అయితే ఇటీవల ఇక్కడ కూడా బీజేపీ కాస్త బలం పుంజుకుంది. ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలని విస్తృతంగా నిర్వహించింది. ఎన్నోకొన్ని అసెంబ్లీ సీట్లు నెగ్గి వచ్చే ఎన్నికల నాటికి బలమైన శక్తిగా ఎదగాలన్నది కమలం ఆలోచనగా కనిపిస్తోంది. ఈసారి ఓటర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేస్తోంది. తాజాగా మెట్రో మ్యాన్ శ్రీధరన్ కమలం గూటికి చేరారు.

పినరయి విజయన్ : –
అటు కరోనా కట్టడి చేయడంలో పినరయి విజయన్ సర్కార్ సమర్థవంతంగా వ్యవహరించిందనే ప్రజలు నమ్ముతున్నారు. గట్టి చర్యలు తీసుకున్నారని, కష్టకాలంలోనూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూశారని, రేషన్‌ సరకుల పంపిణీ వంటివి సమర్ధవంతంగా నిర్వహించారని పేరు తెచ్చుకున్నారు. అయితే శబరిమల ఆలయంలోకి మహిళలను అనుమతించే విషయంలో భక్తులపై దాడి చేయడం, కేసులు పెట్టడం వంటివి కాస్త ఇబ్బందికరంగా మారాయి. కేరళ వ్యాప్తంగా శబరిమల ఆందోళనలకు సంబంధించి దాదాపు 2వేల కేసులు పెట్టారు. తాము అధికారంలోకి రాగానే ఆ కేసులను తొలగిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పుడు విజయన్ సర్కార్‌ ఆ కేసులను తొలగించింది. ఇటీవలి లోకల్‌పోల్స్‌లో లెఫ్ట్‌ గెలుపు కూడా అధికారకూటమిలో ఉత్సాహాన్ని నింపింది. మొత్తానికి అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాల్లో మునిగిపోయారు. చూడాలి మరి మళయాళీ మంత్రం ఏ పార్టీకి లాభిస్తుందో మరి.