కరోనాకు ఫ్లాస్మా థెరపీ : కేరళకు అనుమతిచ్చిన ICMR,కానీ

  • Published By: venkaiahnaidu ,Published On : April 9, 2020 / 11:45 AM IST
కరోనాకు ఫ్లాస్మా థెరపీ : కేరళకు అనుమతిచ్చిన ICMR,కానీ

కరోనా పేషెంట్లకు ప్లాస్మా థెరపీ ద్వారా చికిత్స చేసేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR)కేరళకు అనుమతిచ్చింది. కరోనా వైర‌స్‌ ను నాశ‌నం చేసేందుకు ప్ర‌స్తుతం అందుబాటులో వ్యాక్సిన్లు ఇంకా లేన‌ప్ప‌టికీ.. వైద్యులు మాత్రం హెచ్ఐవీ మందులు, యాంటీ మలేరియా డ్రగ్- హైడ్రాక్సీక్లోరోక్విన్ వంటి మందుల‌తో క‌రోనాను త‌గ్గిస్తున్నారు.

అయితే క‌రోనా వైర‌స్ వ‌ల్ల తీవ్ర‌మైన అస్వ‌స్థ‌త‌కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్న‌వారికి మాత్రం ఈ మందులు ప‌నిచేయ‌డం లేదు. దీంతో అలాంటి వారికి వైద్యులు ప్లాస్మా థెర‌పీ చేసేందుకు కేరళకు ICMR అనుమతిచ్చింది. ఇప్ప‌టికే ఈ విధానం అమెరికా, చైనాల్లో ఉప‌యోగంలో ఉంది. అయితే దీనికి మ‌న దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు అనుమ‌తి లేదన్న విషయం తెలిసిందే.(ఏప్రిల్ 14 తర్వాత అందరి లైఫ్ ఎలా ఉండబోతోంది.. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు ఎన్ని దశల్లో ఉంటుంది?)

కేర‌ళ రాష్ట్రానికి ICMR తాజాగా అనుమ‌తులు జారీ చేయడంతో అక్క‌డి ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లో చికిత్స పొందుతున్న క‌రోనా ఎమ‌ర్జెన్సీ పేషెంట్ల‌కు ప్లాస్మా థెర‌పీ విధానంతో చికిత్స చేయ‌నున్నారు. ప్లాస్మా థెర‌పీలో… క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి శ‌రీరం నుంచి ర‌క్తాన్ని సేక‌రించి.. అందులో ఉండే ప్లాస్మాను వేరు చేస్తారు. ఆ ప్లాస్మాను ప్రాణాపాయ స్థితిలో ఉన్న క‌రోనా రోగి ర‌క్తంలోకి ఎక్కిస్తారు. దీంతో 2 రోజుల్లోనే ఆ రోగి సాధార‌ణ స్థితికి చేరుకుంటాడు. ఈ క్ర‌మంలో క‌రోనా వ‌చ్చి ప్రాణాపాయ స్థితిలో ఉన్నా.. ఈ విధానం ద్వారా రోగుల‌ను బ‌తికించేందుకు అవ‌కాశం ఉంటుంది.

అయితే ప్లాస్మా థెర‌పీలో ఒక వ్య‌క్తి నుంచి సేక‌రించే ప్లాస్మాతో రెండు డోసులు మాత్ర‌మే త‌యారు చేయ‌వ‌చ్చ‌ని ICMR తెలియ‌జేసింది. ఒక డోసు వ్య‌క్తికి స‌రిపోతుంద‌ని.. అయితే ప్లాస్మాను సేక‌రించేందుకు క‌రోనా సోకి కోలుకున్న వ్యక్తి వారిని ఒప్పించాల్సి ఉంటుంద‌ని.. ICMR తెలిపింది. ఇక అమెరికా, చైనాల‌లో ఇప్పటికే ఈ విధానం స‌క్సెస్ అయినందున‌.. మ‌న దేశంలోనూ దీన్ని ప్ర‌స్తుతం ప్రారంభించారు. అయితే ఈ విధానం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ది క‌నుక‌.. కేవ‌లం అత్య‌వ‌సర స్థితి ఉన్న క‌రోనా పేషెంట్ల‌కు మాత్ర‌మే ఈ విధానంలో చికిత్స చేయ‌నున్నారు.

అయితే ICMR నుంచి కేరళ.. ఫ్లాస్మా థెరపీ కోసం అనుమతి పొందినప్పటికీ, డ్రగ్ కంట్రోలర్స్ ఆఫ్ ఇండియా CDCSOనుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ఎవరైనా కరోనా సోకి కోలుకున్న వ్యక్తి అంగీకరిస్తే, తాము యాంటీబాడీ లెవల్స్ కోసం పరీక్ష చేయవచ్చని సీఎం పిన్నరయి విజయన్ కు సూచనల కోసం ఏర్పాటు చేసిన మెడికల్ ఎక్స్ పర్ట్ ప్యానెల్ సభ్యుడు మరియు బేబీ మొమోరియల్ హాస్పిటల్ లో ఓ క్రిటికల్ కేర్ డాక్టర్ అనూప్ కుమార్ తెలిపారు. ఇది రక్తదానం లాంటిది కాదని ఆయన తెలిపారు. కేవలం శరీరంలో నుంచి ఫ్లాస్మా మాత్రమే సేకరించబడుతుందని తెలిపారు. 55కేజీల బరువు మరియు రక్తంలో తగినంత ప్రొటీన్ ఉన్న వ్యక్తి…800ML ఫ్లాస్మా దానం చేయవచ్చని తెలిపారు. దీంతో నలుగురు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయవచ్చని తెలిపారు.

ఒక్కో పేషెంట్ కు 200ML ఫ్లాస్మా అవసరమవుతుందని ఆయన తెలిపారు. వెంటిలేటర్ పై ఉన్నవారు మరియు ఆరోగ్యం విషమంగా ఉన్న కరోనా పేషెంట్ల కోసమే ఫ్లాస్మా థెరపీ ఉద్దేశించబడిందని తెలిపారు. తిరువనంతపురంలోని ప్రముఖ… శ్రీచిత్ర తిరునాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ డైరక్టర్ డాక్టర్ ఆశా కిషోర్ మాట్లాడుతూ… డ్రగ్ కంట్రోలర్ నుంచి ఆమోదం కోసం ఎదురుచూస్తున్నామని,రాష్ట్రంలోని ఐదు మెడికల్ కాలేజీల్లో ఫ్లాస్మాథెరపీస్ జరగనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టును శ్రీచిత్ర లీడ్ చేస్తుందని ఆశా కిషోర్ తెలిపారు.