గురువారం కేరళ బంద్

  • Edited By: chvmurthy , January 2, 2019 / 03:41 PM IST
గురువారం కేరళ బంద్

తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి  బుధవారంనాడు 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు వెళ్ళి దర్శనం చేసుకోవటాన్ని నిరసిస్తూ గురువారం కేరళ లో బంద్ పాటిస్తున్నారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళలు దర్శనం చేసుకోవటం పట్ల హిందూ సంస్ధలు ఆగ్రహంతో ఉన్నాయి. మరోవైపు ఆలయ అర్చకులు ఆలయాన్ని శుధ్ది చేసేందుకు  కొన్ని గంటలపాటు ఆలయ తలుపులను మూసివేయటం పట్ల కూడా కొందరు ఆగ్రహంగా ఉన్నారు.  

మహిళలు దర్శనం చేసుకోవటం వల్ల అపచారం జరిగిందంటూ శుద్ధి పూజలు నిర్వహించడం కూడా ‘అంటరానితనం’ కిందకే వస్తుందని, ఈ విషయంలో దేశంలో అన్ని రకాల అంటరానితనాలను నిషేధిస్తున్న భారత రాజ్యాంగంలోని 17వ అధికరణను పూజారులు ఉల్లంఘించారని కొందరి వాదన. ఈ లెక్కన ఆలయ పూజారులు కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్లే కనుక సీఎం  పినరయ్ విజయన్ వారిపై కేసు పెడతారా లేదా అనేది పెద్ద చర్చనీయాంశం అయ్యింది.  కాగా శుద్ది పూజల పేరుతో ఆలయం తలుపులు మూసిన పూజారులపై చర్యలు తీసుకుంటామని ట్రావన్ కోర్ దేవస్దానం ప్రకటించింది.  
శబరిమల కర్మ సమితి  ఆధ్వర్యంలో గురువారం కేరళ బంద్ నిర్వహిస్తున్నారు. ఈ బంద్ కు కేరళ బీజేపీ శాఖ కూడా  మద్దతు తెలుపుతూ రెండు రోజులపాటు నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు బంద్ చేయాలని  శబరిమల కర్మ సమితి కోరింది. కాగా రేపటి బంద్ లో పాల్గోనబోమని కొన్ని వాణిజ్య సంస్దలుప్రకటించాయి.