కేరళలో ఫుల్ టెన్షన్ : కొనసాగుతున్న కేరళ బంద్

  • Edited By: madhu , January 3, 2019 / 04:01 AM IST
కేరళలో ఫుల్ టెన్షన్ : కొనసాగుతున్న కేరళ బంద్

తిరువనంతపురం : కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ రాయి ఎక్కడి నుండి పడుతుందో…ఎవరు ఎక్కడి నుండి దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కొంతమంది హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించడం పట్ల హిందూ సంఘాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఆలయ ప్రతిష్ట మంటకలిపారంటూ మండిపడుతున్నారు. 2019, జనవరి 3వ తేదీన కేరళ రాష్ట్ర బంద్ జరుగుతోంది. జనవరి 2వ తేదీన జరిగిన ఆందోళనలో పాల్గొన్న 54 ఏళ్ల చంద్రన్  కార్యకర్త మృతి చెందడంతో కేరళలో పరిస్థితి అదుపు తప్పుతోంది. 
హింసాత్మకంగా బంద్…
ఈ బంద్ హింసాత్మకంగా మారుతోంది. బీజేపీ, యువమోర్చా కార్యకర్తలు ఆందోళనలు..నిరసనలు చేపడుతున్నారు. స్వామియే శరణం అయ్యప్ప…అయ్యప్ప శరణం…అంటూ అయ్యప్ప భక్తులు నడి రోడ్లపై భజనలు చేస్తూ తమ నిరసనను తెలియచేస్తున్నారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభిస్తోంది. పందలంలోని సీపీఎం కార్యాలయంపై ఆందోళనకారులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాళ్ల దాడిలో 60 బస్సులు ధ్వంసమయ్యాయి. చెన్నై టూరిజం హోటల్స్‌పైకి కూడా దాడికి పాల్పడ్డారు. హిందూ సంఘాలే ఈ దాడి చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా హోటల్స్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.