ఆన్ లైన్ పెళ్లి : యూపీలో వధువు…ఫోన్ లోనే తాళిబొట్టు కట్టిన కేరళ వరుడు

ఆన్ లైన్ పెళ్లి : యూపీలో వధువు…ఫోన్ లోనే తాళిబొట్టు కట్టిన కేరళ వరుడు

కోవిడ్ -19 నేపథ్యంలో విధించబడిన లాక్ డౌన్  కారణంగా దేశవ్యాప్తంగా అనేక పెళ్లిళ్లు ఆగిపోయిన విషయం తెలిసిందే. చాలా జంటలు తమ వివాహాలను వాయిదా వేసుకోగా,మరికొందరు మాత్రం లాక్ డౌన్ సమయంలోనే కేవలం కుటుంబసభ్యుల సమక్షంలో వివాహాలు చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు కేరళకు చెందిన ఓ జంట చేసుకున్న “వర్చువల్ వివాహాం” ఇప్పుడు వరల్డ్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. కేరళకు చెందిన యువకుడు ఉత్తరప్రదేశ్‌లో ఉన్న వధువుతో వర్చువల్ వివాహాం(మొబైల్ ఫోన్ ద్వారా పెళ్లి) చేసుకొని అందరినీ ఆశ్చర్చపర్చాడు. నీ దుంప దెగా..ఓ నెల రోజులు ఆగలేకపోయారా..పెళ్లి ఖర్చులు మిగిలాయ్..కాపురం కూడా ఆన్ లైన్ లో చేస్తారా? అంటూ ఇప్పుడు ఈ మొబైల్ పెళ్లిపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

అసలు ఏం జరిగింది
కేరళలోని కొట్టాయం జిల్లాలోని చెంగనస్సేరీకి చెందిన శ్రీజిత్ నటేసన్ కు, ఉత్తరప్రదేశ్ లో ఉద్యోగం చేస్తున్న అలప్పుజా సిటీకి చెందిన అంజనాకు గతేడాది నవంబర్ లో నిశ్చితార్థం జరిగింది. అలప్పుజాలోని ఓ ఆడిటోరియంలో ఈ నెల 26న వారి వివాహం జరగాల్సి ఉంది. అయితే ఇంతలో కరోనా,ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చేసింది. ఆకశ్మిక లాక్ డౌన్ తో  అంజనా ఉత్తరప్రదేశ్ లోనే చిక్కుకుపోయింది. దీంతో ఇరుకుటుంబాలు పెళ్లని వాయిదా వేసేందుకు నిర్ణయించారు. అయితే కంప్యూటర్ ఫీల్డ్ లో పనిచేస్తున్న అంజనా ఇచ్చిన ఓ ఐడియా ప్రకారం…అనుకున్న సమయానికే వర్చువల్ మ్యారేజీకి ఈ జంట రెడీ అయింది. దీనికి కుటుంబసభ్యులు కూడా ఒప్పకున్నారు.

ఆదివారం(ఏప్రిల్-26,2020) బ్యాంకు ఉద్యోగి అయిన వరుడు శ్రీజిత్… అలప్పుజలోని వధువు అంజనా బంధువు ఇంటికి చేరుకున్నాడు. అంజనా తండ్రి అక్కడ ఉన్నాడు. అయితే అంజనా తల్లి మరియు సోదరుడు లక్నోలోనే ఉన్నారు. షెడ్యూల్ చేసిన సమయంలో – మధ్యాహ్నం 12.15 నుండి మధ్యాహ్నం 12.45 మధ్యలో శ్రీజిత్ మరియు అంజనా ఇద్దరూ పెళ్లి వస్త్రధారణ ధరించి మొబైల్‌లో ప్రత్యక్షంగా వచ్చి వివాహ ముడిని ప్రతీకగా కట్టారు. మొబైల్ ఫోన్ వెనుక తాళి కడుతున్నట్లు వరుడు చేయగా,వధువు మెడలో వెనుక నుంచి వాళ్ల అమ్మ తాళిబొట్టును ముడివేస్తూ ఉంది. ఈ మొబైల్ మ్యారేజీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. లాక్ డౌన్ ఎత్తేసిన తర్వాత…అంజనా తిరిగి కేరళకు వస్తుందని, వివాహ రిసెప్షన్, రిజిస్ట్రేషన్ జరుగుతుందని శ్రీజిత్ తెలిపాడు.