ట్రంప్ కారు కోసం రంగంలో దిగిన కేరళ బిజినెస్‌మెన్

ట్రంప్ కారు కోసం రంగంలో దిగిన కేరళ బిజినెస్‌మెన్

ఖరీదైన కార్లలో తిరగాలని చాలామందికి కోరిక ఉంటుంది. ఎన్నికార్లు ఉన్నా.. కొత్త రకం కారుల్లో తిరగాలని కొందరికి ఉంటుంది. అటువంటి కోరిక ఉన్న కేరళకు చెందిన బిజినెస్ మెన్ ట్రంప్ కారును కొనేందుకు సిద్ధమై వార్తల్లోకి ఎక్కాడు. తన ఆభరణాల షోరూమ్ ప్రారంభోత్సవం కోసం ఫుట్‌బాల్ లెజెండ్ డియెగో మారడోనాను కేరళకు రప్పించి అప్పట్లో వార్తల్లో నిలిచిన కేరళకు చెందిన ఆభరణాల వ్యాపారి బాబీ చెమ్మనూర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ కారును కొనుగోలు చేసేందుకు సంబంధించిన వేలంలో పాల్గొనేందుకు సిద్దం అవుతున్నట్లు వెల్లడించారు.

ఒక వార్తా పత్రికతో చెమ్మనూర్ మాట్లాడుతూ “అవును, వేలంలో పాల్గొంటున్నాను.. మా టెక్సాస్ కార్యాలయం ఇప్పటికే వేలంలో పాల్గొనడానికి సిద్ధం అయ్యింది” అని చెప్పుకొచ్చారు. బాబీ చెమ్మనూర్‌కు దేశవిదేశాల్లో అనేక ఆభరణాల కంపెనీలు ఉన్నాయి. ఆయనకు కార్లు అంటే కూడా చాలా ఇష్టం. బాబీ చెమ్మనూర్ ఇటీవల మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి ఎలక్ట్రిక్ కారును కూడా కొన్నారు. భారతదేశపు మొట్టమొదటి లగ్జరీ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈ మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి.

అంతేకాదు.. బాబీ చెమ్మనూర్ ప్రపంచంలో అత్యంత ఖరీదైన వాహనాలలో ఒకటైన రోల్స్ రాయిస్ కారును టాక్సీగా నడుపుతున్నాడు. ఈ రకంగా బాబీ చెమ్మనూర్ పేరు వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్‌ను కూడా వేలంలో సొంతం చేసుకోవాలని బాబీ చెమ్మనూర్ భావిస్తున్నారు.

డోనాల్డ్ ట్రంప్ ఉపయోగించిన రోల్స్ రాయిస్ ఫాంటమ్ చాలా లగ్జరీ ఫీచర్స్ కలిగి ఉంది. ఇందులో థియేటర్ ప్యాకేజీ, స్టార్‌లైట్ హెడ్‌లైనర్ మరియు ఎలక్ట్రానిక్ కర్టెన్‌లు చాలా ముఖ్యమైనవి. ఈ కారు ఇప్పటికి 91,249 కిలోమీటర్లు ప్రయాణించింది. రోల్స్ రాయిస్ నిర్మించిన ఈ 2010 మోడల్ ఫాంటమ్ కారు ఆ కాలంలో కంపెనీ తయారు చేసిన 537 కార్లలో ఒకటి. ఈ కారు బేస్ ప్రైస్ రూ.3 కోట్లుగా ఉండొచ్చ‌ని అంచనా వేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Boby Chemmanur (@boby_chemmanur)