మీరు ఒంటరిగా లేరు.. మీతో మేమున్నాం: పిల్లల ఆత్మహత్యలు తగ్గించే కార్యక్రమం

  • Published By: vamsi ,Published On : July 19, 2020 / 07:12 AM IST
మీరు ఒంటరిగా లేరు.. మీతో మేమున్నాం: పిల్లల ఆత్మహత్యలు తగ్గించే కార్యక్రమం

కేరళలో మార్చి 25వ తేదీన కోవిడ్ -19 లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి కనీసం 66 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌ల వాడకం కోసం తల్లిదండ్రులు తిట్టడంతో కొందరు, ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవడంలో విఫలం కావడం వంటి వివిధ కారణాలతో మరికొందరు రాష్ట్రంలో పిల్లలు ఆత్మహత్యలు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ క్రమంలోనే కన్సల్టెన్సీ కార్యక్రమం ఒకటి కేరళలో ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ సంధర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల మంచి కోసం వారి భావాలను బాధపెట్టవద్దని హెచ్చరికలు చేస్తున్నారు అధికారులు. ఈ మేరకు కేస్ స్టడీకి కూడా ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యమంత్రి విజయన్ మాట్లాడుతూ.. “పిల్లలలో ఆత్మహత్య ధోరణుల పెరగడం చాలా తీవ్రమైన సామాజిక సమస్యగా మారిందని, దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రారంభమైన తరువాత, 18 ఏళ్లలోపు 66 మంది పిల్లలు వివిధ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు వెల్లడించారు.

ఈ క్రమంలో మానసిక ఒత్తిళ్లకు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటున్న పిల్లలకు సహాయం చేయడానికి, ప్రభుత్వం ‘పిల్లలు.. మా బాధ్యత(ORC)’ ప్రోగ్రామ్ కింద చిరిటెల్-కౌన్సెలింగ్‌ను ప్రారంభించింది. ఈకార్యక్రమంలో 12 నుంచి 18 సంవత్సరాల లోపు పిల్లలకు నిపుణులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తారు. ఇవే కాకుండా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న పిల్లలను ఆత్మహత్య ధోరణుల నుంచి రక్షించడానికి ప్రభుత్వం “ఒట్టకల్లా ఒపముండు” (మీరు ఒంటరిగా లేరు, మీతో మేము ఉన్నాము) కార్యక్రమాన్ని ప్రారంభించింది.

గత రెండు వారాల్లో రాష్ట్ర మానసిక ఆరోగ్య కార్యక్రమం కౌన్సెలింగ్‌లో ఒట్టక్కల్లా ఒప్పముండు 64వేల మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇవ్వగా, అధికారులు ఆత్మహత్య ధోరణి ఉన్న ఏడుగురు పిల్లలను మాత్రమే గుర్తించగలిగారు. జూలై 10 వరకు మొత్తం 10,299 మంది పిల్లలకు కౌన్సెలింగ్ ఇచ్చారు, ఇందులో 3,084 మంది విద్యార్థులు ఒత్తిడితో బాధపడుతున్నారని, 2,905 మంది విద్యార్థులు ఆందోళనతో బాధపడుతున్నారని గుర్తించారు.

ఆత్మహత్య ద్వారా ఎలా చనిపోతారనే జ్ఞానం చిన్న చిన్న పిల్లలలో కూడా ఉండడం ఆందోళన కలిగిస్తుందని అక్కడి నిపుణులు అంటున్నారు. లాక్‌డౌన్ కాలంలో జరిగిన 66 ఆత్మహత్యలలో, 61 మంది ఉరి వేసుకోగా.., ముగ్గురు విషం తాగి, ఒకరు ఎత్తు నుంచి దూకి, ఒకరు ఒంటికి నిప్పంటించుకుని చనిపోయారు. మరణించిన 66 మంది పిల్లలలో 64 మంది 12 నుండి 18 సంవత్సరాల వయస్సులో ఉన్నారు, ఇద్దరు 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు.