Kerala Man Jackpot : అదృష్టవంతుడు.. లాటరీలో రూ.40 కోట్లు గెలుచుకున్న ట్యాక్సీ డ్రైవర్
అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. ఒక్కసారి లక్ తగిలిందంటే చాలు జీవితమే మారిపోతుంది. నిరుపేద కూడా రాత్రికి రాత్రే సంపన్నుడు అయిపోతాడు. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ కి జాక్ పాట్ తగిలింది.

Kerala Man Jackpot : అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పలేము. ఒక్కసారి లక్ తగిలిందంటే చాలు జీవితమే మారిపోతుంది. నిరుపేద కూడా రాత్రికి రాత్రే సంపన్నుడు అయిపోతాడు. తాజాగా ఓ ట్యాక్సీ డ్రైవర్ కి జాక్ పాట్ తగిలింది. లాటరీ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. రాత్రికి రాత్రే అతడు కరోడ్ పతి అయ్యాడు. అతడు లాటరీలో రూ.40కోట్ల గెలిచాడు.
అబుదాబిలో 2008 నుంచి టాక్సీ డ్రైవర్‌గా పనిచేస్తున్న కేరళ వ్యక్తి రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. ఇటీవల అతడు కొనుగోలు చేసిన లాటరీ టికెట్‌కు రూ.40 కోట్ల జాక్‌పాట్ తగిలింది. తొలుత ఈ విషయాన్ని నమ్మలేని అతడు ఆ తర్వాత తనకు దక్కిన అదృష్టాన్ని చూసి మురిసిపోయాడు.
ట్యాక్సీ డ్రైవర్ అయిన రెంజిత్ సోమరాజన్(37) మూడేళ్లుగా లాటరీ టికెట్లు కొంటున్నాడు. గత నెల 29న తన సహచరులైన 9మందితో కలిసి తలా 100 దిర్హమ్‌లు వేసుకుని తన పేరుపై లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్‌కు 3 కోట్ల దిర్హమ్‌లు (దాదాపు 40 కోట్లు) తగిలాయి. జాక్‌పాట్ తగిలిన విషయం తెలిసి సోమరాజన్ ఉప్పొంగిపోయాడు. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు.
రెంజిత్ సోమరాజన్ కుటుంబ పోషణ కోసం అబుదాబి వెళ్లాడు. అక్కడ కారు డ్రైవర్ గా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషిస్తున్నాడు. 2008లో ఇండియా నుంచి దుబాయ్‌కు వచ్చానని చెప్పాడు. అప్పటినుంచి బతుకుదెరువు కోసం డ్రైవర్‌గా మారానన్నాడు. ‘ఎప్పటికైనా అదృష్టం కలిసిరాదా అని చెప్పి.. లాటరీ టికెట్లు కొనుగోలు చేయడం ప్రారంభించాను. అలా పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్‌కు చెందిన మిగతా వ్యక్తులతో కలిసి ”రెండు కొంటే ఒక లాటరీ టికెట్ ఉచితం” ఆఫర్‌ను కనుక్కున్నా. ఆ తొమ్మిది మంది నుంచి 100 దిర్హామ్‌లు వసూలు చేసి జూన్ 29న టికెట్‌ను కొనుగోలు చేశాను. నా ఒక్కడి పేరుతో తీస్తే అదృష్టం లేదని.. అందుకే మరో తొమ్మిది మందిని జత చేశాను. ఇవాళ నా పంట పండింది. నా వాటా తీసుకొని మిగతాది మా వాళ్లకు ఇచ్చేస్తాను. ఎందుకంటే వారు నాపై నమ్మకం ఉంచి లాటరీ టికెట్‌కు డబ్బులు ఇచ్చారు’ అని సోమరాజన్ చెప్పాడు. మొత్తం 9మంది ఉన్నారు కనుక ఒక్కొక్కరికి రూ.3 కోట్లపై వచ్చే అవకాశం ఉంది.