సైకిల్ పోయిందని ఫేస్ బుక్ లో పోస్టు, స్పందించిన సీఎం

సైకిల్ పోయిందని ఫేస్ బుక్ లో పోస్టు, స్పందించిన సీఎం

son gets new bicycle : సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం స్పందిస్తుంటారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొనేందుకు ముందుకు వస్తుంటారు. తన కొడుకు సైకిల్ ను ఎవరో ఎత్తుకెళ్లారని, ఎవరికైనా దొరికితే..ఆచూకీ చెప్పండి అంటూ…వికలాంగ వ్యక్తి ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఈ పోస్టు తెగ వైరల్ అయ్యింది. ముఖ్యమంత్రి కార్యాలయం వద్దకు సమాచారం పోవడంతో..వెంటనే అధికారులు స్పందించారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పునలూర్ – మూవట్టుపుజ రాష్ట్ర రహదారిపై ఉన్న పైకా సమీపంలోని కురువిక్కూడు జంక్షన్ వద్ద ఓ కామన్ సర్వీసు సెంటర్ ను సునీల్ జోసెఫ్ నడుపుతున్నాడు. ఇతను వికలాంగుడు. భార్య, కుమార్తె, కొడుకుతో ఉంటున్నాడు. 9 సంవత్సరాల కొడుకు సైకిల్ కొనివ్వాలని అనుకున్నాడు. అంతగా ఆర్థిక పరిస్థితి లేదు. చివరకు పైసా పైసా పోగు చేసి రూ. 6 వేల విలువ చేసే సైకిల్ ను కొనిచ్చాడు. ఇందుకు దాదాపు చాలా నెలలే పట్టింది. కష్టపడి కొనిచ్చిన సైకిల్ ను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. వెతకడానికి చాలా ప్రయత్నాలే చేశాడు. చివరకు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. జనవరి 23వ తేదీన తన ఫేస్ బుక్ పేజీ ద్వారా నెటిజన్లకు విజ్ఞప్తి చేశాడు.

‘నా కుమారుడు జస్టిన్ సైకిల్ ను ఎవరో దొంగిలించారు. ఎవరికైనా ఏదైనా స్క్రాప్ డీలర్ షాపులో లేదా మరెవరి దగ్గరైనా దొరికితే దయచేసి ఈ క్రింది నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయండి.” అని పోస్ట్ చేశాడు. నెటిజన్ల నుంచి ఊహించనిరీతిలో స్పందన వచ్చింది. ఈ పోస్టు వైరల్‌గా మారింది. దీనిని సీఎం పినరయి విజయన్ గమనించారు. బాలుడికి కొత్త సైకిల్ ను కొనివ్వాలని కొట్టాయం కలెక్టర్ ఎం.అంజనాను ఆదేశించారు. రిపబ్లిక్ డే రోజున…జోసెఫ్ ఇంటికి వెళ్లిన కలెక్టర్ అంజనా..సైకిల్ అందచేశారు. సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన జోసెఫ్.. తాను అక్షయ కేంద్రం ఏర్పాటు చేసుకోని స్వయం ఉపాధి పొందాలనుకుంటున్నానని, ప్రభుత్వం నుంచి దీనికి తగిన ఆర్థిక సహాయం చేయాలని జోసెఫ్ కలెక్టర్‌ను ఆయన కోరారు. వికలాంగుడైన సునీష్ జోసెఫ్ కు వీల్ ఛైర్ కొనుక్కోవడానికి ఆర్థిక సహాయం చేస్తామని అధికారులు వెల్లడించారు.