కేరళలో కరోనా సెకండ్ వేవ్..మరోసారి లాక్ డౌన్ తప్పదేమో : మంత్రి శైలజ

  • Published By: nagamani ,Published On : September 28, 2020 / 03:40 PM IST
కేరళలో కరోనా సెకండ్ వేవ్..మరోసారి లాక్ డౌన్ తప్పదేమో : మంత్రి శైలజ

kerala second corona wave:దేశంలో ఓవైపు కరోనా కేసులు పెరుగుతునే ఉన్నాయి. అయినా సరే కేంద్ర..రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్ విడతలవారీగా ఎత్తివేస్తున్నాయి. ఈ సమయంలో కేరళ ఆరోగ్యశాఖ మంత్రి శైలజ లాక్ డౌన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోసారి సంపూర్ణ లాక్‌డౌన్ తప్పదేమోనని..పరిస్థితులు అలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ తో విసిగిపోయిన ప్రజలు ఇప్పుడిప్పుడే బైటకు వచ్చి తమ రోజువారీ పనులు చేసుకుంటున్నారు. కానీ కరోనా ఏమాత్రం తగ్గకపోవటంతో మరోసారి లాక్ డౌన్ తప్పదేమో అని మంత్రి వ్యాఖ్యానించారు. లాక్ డౌన్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తే కరోనాను అదుపుచేయడం మరింత కష్టం అవుతుందని కేసులు మరింతగా పెరుగుతాయని మంత్రి శైలజ అభిప్రాయపడ్డారు.


ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకూ కేరళ సంప్రదాయ పండుగ ఓనం జరిగింది. ఈ పండుగ తరువత కేరళలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దీంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా 20 నుంచి 40 సంవత్సరాల వయసు వారే ఎక్కువగా ఉన్నారు. దీంతో కేరళలో ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేస్తే తప్ప సాధారణ పరిస్థితి రాదని మంత్రి అభిప్రాయపడ్డారు. అందుకే మరోసారి తిరిగి లాక్ డౌన్‌ను అమలు చేయాల్సి వస్తుందేమోనని అభిప్రాయపడ్డారు. కేరళలో ఇప్పటి వరకు 1,75,384 కరోనా 677 మంది చనిపోయారు. 1,18,447 మంది కోలుకున్నారు.


కాగా కేరళలో కరోనా కేసులు సెకండ్ వేవ్ ప్రారంభమైనట్లుగా కేసులు పెరుగుతున్నాయి. కరోనా ఇండియాకు ప్రవేశించిన తొలి దశలో, అత్యధిక కేసులను కలిగివున్నప్పటికీ..వైరస్ వ్యాప్తిని సమర్థవంతంగా కట్టడి చేసిన రాష్ట్రంగా పేరు తెచ్చుకున్న కేరళలో..రెండవ విడతగా మారు మహమ్మారి విజృంభిస్తోంది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే 40 వేల కొత్త కేసులు వచ్చాయి. ఓనమ్ పండగ సందర్భంగా నిబంధనలను సడలించడం, ఆపై దేవాలయాలను తెరవడం వంటి కారణాలతో పాటు, ప్రజలు కొవిడ్ నిబంధనలను పాటించకపోవడం, నిరసనల్లో పాల్గొనడం కూడా కేసుల పెరుగుదలకు కారణమని వైద్య వర్గాలు అభిప్రాయాలు వెల్లడించాయి.


ఈ క్రమంలోనే అక్టోబర్ కల్లా కేరళలో కొత్త కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజ తెలిపారు. టెస్ట్ పాజిటివ్ రేటు దేశవ్యాప్తంగా సగటున 8 శాతం ఉండగా, కేరళలో మాత్రం 11.9 శాతంగా ఉందని ఆమె గుర్తు చేశారు. కరోనా వైరస్ వచ్చిన తొలి రోజు నుంచి తమ వ్యూహం ఒకటేనని..మరణాల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పనిచేశామనీ..దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య ఒక శాతం కన్నా తక్కువగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ఉంటుందని ముందుగానే అంచనా వేశామని అనుకున్నట్లుగానే ఓనం పండుగ తరువాత కేసులు పెరుగుతున్నాయన్నారు.


వైరస్ ను తక్కువగా అంచనా వేయకుండా రాష్ట్ర ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకోవాలని..ప్రజా సమూహాల మధ్యకు వెళ్లవద్దని మంత్రి శైలజ సూచించారు. రాష్ట్రంలో ప్రతి చదరపు కిలోమీటర్ కు 860 మంది ప్రజలు నివాసం ఉంటున్నారని..వారిలో 15 శాతం మంది 60 ఏళ్లకు పైబడిన వారు కావడంతోనే కేసుల సంఖ్య పెరుగుతోందని అన్నారు. పరిస్థితిని సమీక్షించేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించిన మంత్రి శైలజ లక్షణాలు లేని కరోనా రోగులను ఇంట్లోనే ఉంచి చికిత్స అందించాలని ఆదేశించామని తెలిపారు.