రబీ పంటలకు MSP పెంపు..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

  • Published By: venkaiahnaidu ,Published On : October 23, 2019 / 01:33 PM IST
రబీ పంటలకు MSP పెంపు..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

రబీ పంటలకు కనీస మద్దతు ధర(MSP) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇవాళ(అక్టోబర్-23,2019) నిర్ణయం తీసుకుంది. 50శాతం నుంచి 109శాతం రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచారు. వ్యవసాయ సంక్షోభం నుండి ఒత్తిడికి గురవుతున్న రైతులకు ఈ నిర్ణయం సంతోషం కలిగించనుందని మోడీ సర్కార్ చెబుతోంది.

 గోధుమ,బార్లీ ధరను 85రూపాయలు,శనగలు రూ.255,కందిపప్పు రూ.325,ఆవాలు రూ.225 పెంచుతూ కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ తెలిపారు. ఢిల్లీలో అనధికార కాలనీలను క్రమబద్ధీకరించాలని కేబినెట్ నిర్ణయించిందని ఆయన తెలిపారు.ఓ కమిటీ సిఫారసుల ఆధారంగా ఢిల్లీలో అన్ ఆథరైజ్డ్ కాలనీలను రెగ్యులరైజ్ చేయాలని,ఢిల్లీలో అనధికార కాలనీలలో నివసిస్తున్న 40 లక్షల మందికి యాజమాన్య హక్కులు కల్పించాలని నిర్ణయించినట్లు జవదేకర్ తెలిపారు.

ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశంలో.. కొత్త కంపెనీలు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ రిటైల్ మార్కెట్లోకి ప్రవేశించవచ్చని నిర్ణయం తీసుకున్నట్లు జవదేకర్ తెలిపారు. ఈ చర్య వల్ల పోటీ పెరుగుతుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది,కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయని జవదేకర్ అన్నారు.

పిఎస్‌యులను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన ఎమ్‌టిఎన్‌ఎల్, బిఎస్‌ఎన్‌ఎల్‌లను పటిష్ఠ పర్చాలని కేబినెట్ నిర్ణయించినట్లు, పునరుద్ధరణ ప్రణాళికను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండింటి యొక్క విలీనానికి కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 4జి స్పెక్ట్రమ్ టెలికాం పిఎస్ఇ (పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్)కు కేటాయించబడుతుందని తెలిపారు.

టెలికాం రంగంలో తీవ్రమైన పోటీ మధ్య ప్రభుత్వ రంగ సంస్థలు ఎమ్‌టిఎన్‌ఎల్, బిఎస్‌ఎన్‌ఎల్ ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న తరుణంలో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.విఆర్ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ పథకం) ప్యాకేజీలను అందించనున్నట్లు తెలిపారు. MTNL లేదా BSNL మూసివేయబడవు, లేదా పెట్టుబడి పెట్టబడకుండా ఉండవు, లేదా మూడవ పార్టీకి నియమించబడవు అని ఆయన తెలిపారు.