Bhilwara MG Hospital : ఆక్సిజన్​ కొరత అంటే ఏంటో తెలియదు ఈ ఆసుపత్రికి..ప్రాణవాయువు వినియోగంలో ఆదర్శం

Bhilwara MG Hospital : ఆక్సిజన్​ కొరత అంటే ఏంటో తెలియదు ఈ ఆసుపత్రికి..ప్రాణవాయువు వినియోగంలో ఆదర్శం

Bhilwara mahatma Gandhi District Hospital

Bhilwara Mahatma Gandhi District Hospital : దేశమంతా ఆక్సిజన్ కొరతతో అల్లాడిపోతుంటే ఓ ఆస్పత్రి మాత్రం ‘ఆక్సిజన్ కొరతా? ఆ మాటే మాకు తెలీదే’ అంటోంది. మా ఆస్పత్రిలో ప్రాణవాయువు ఫుల్..కొరత నిల్’’అంటోంది. ఆక్సిజన్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది రాజస్థాన్ భిల్వారా ఆసుపత్రి. దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల పరిస్థితిని ముందే పసిగట్టి ముందస్తు జాగ్రత్తతో ఆక్సిజన్ కొరత అనే మాటే కుండా బాధితులకు చక్కగా ఆక్సిజన్ అందిస్తూ..ప్రాణాలను నిలబెడుతోంది భిల్వారాని మహాత్మా గాంధీ జిల్లా ఆస్పత్రి.

కరోనా ఇంతటి తీవ్ర రూపం దాల్చినా.. భిల్వారా ఆస్పత్రిలో ఒక్క రోగికీ ఆక్సిజన్ అందకపోవడమన్నది ఇప్పటి వరకూ జరగలేదు. అలాగని ఆ ఆస్పత్రిలో కరోనా బాధితులు తక్కువగా ఉన్నారా? అంటే అదీ కాదు. 8 వేల మంది పేషెంట్లకు నిరంతరాయంగా ఆక్సిజన్ ను సరఫరా చేస్తూ శెభాష్ అనిపించుకుంటోంది. గత ఏడాది కరోనా మొదటి వేవ్ లో కూడా అంత్యం సమర్థవంతంగా అత్యంత కఠినమైన లాక్ డౌన్ నిబంధనలను విధించి తనదైన శైలిలో చక్కటి పేరు తెచ్చుకుంది ఖిల్వారా సిటీ. ఇప్పుడు ఈ సెకండ్ వేవ్ ప్రమాదకర పరిస్థితులో కూడా ఆక్సిజన్ వినియోగంలో ఆదర్శంగా నిలుస్తోంది. అదే రాజస్థాన్ లోని భిల్వారా పట్టణం.

భిల్వారాలో 430 పడకల మహాత్మా గాంధీ జిల్లా ఆసుపత్రి ఉంది. అందులో 300 మంది దాకా కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో బెడ్లన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయినా ఆక్సిజన్ కొరతమాత్రం రాలేదు. దానికి కారణం.. వైరస్ కట్టడిలో ఆ ఆసుపత్రి గీసుకున్న నిబంధలు. ఆక్సిజన్ కొరత రాకుండా ఎక్కడికక్కడ చర్యలు చేపట్టింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని ముందే గ్రహించి ఆక్సిజన్ అధికారులు ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. దానికి ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆక్సిజన్ ప్లాంటును ఏర్పాటును వెంటనే చేయించింది. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ అరుణ్ గౌర్ తెలిపారు. ప్రభుత్వం సహకారంతో ఇటువంటి చర్యలు తీసుకుని ఆస్పత్రికి వచ్చే ఏ ఒక్క పేషెంటుకు ఆక్సిజన్ కొరత అనేది లేకుండా చేయగలిగామని తెలిపారు.

ముందస్తు జాగ్రత్తగా తీసుకున్న చర్యల ఫలితమే ఇప్పుడు తమకు ఆక్సిజన్ కొరత లేకుండా చేసిందని తెలిపారు. ప్రతి రోజూ 100 సిలిండర్లకు పైగా ఆక్సిజన్ ను తమ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుందని..గత కొన్ని రోజుల క్రితం వరకూ ఆసుపత్రికి రోజూ 30 నుంచి 40 సిలిండర్లు మాత్రమే అవసరమయ్యేవి..కానీ..రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల వల్ల 400 నుంచి 450 దాకా అవసరమవుతున్నాయని వెల్లడించారు. ఆస్పత్రిలో ఉత్పత్తి అయ్యేవ కాకుండా..అవసరమైతే వేరే ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నామని..ఏం చేసినాగానీ ఆక్సిజన్ కొరత అనేది లేకుండా చేస్తున్నామని తెలిపారు.

ఇప్పటి పరిస్థితుల్లో మా ప్రస్తుతం కర్తవ్యం ఆక్సిజన్ ను ఆదా చేయడమేనని..దాని కోసం ముగ్గురు డాక్టర్లు, ముగ్గురు టెక్నికల్ స్పెషలిస్టులతో ఓ టీమ్ ను ఏర్పాటు చేశామని..ఆ టీమ్ ఎప్పటికప్పుడు కేంద్రీకృతమైన ఆక్సిజన్ పాయింట్లను పరిశీలిస్తుందని తెలిపారు. దీంతో ఆక్సిజన్ ను నిరంతరంగా సరఫరా చేస్తున్నామని అన్నారు.