Sri Krishna Janmabhoomi Row : శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదు నిర్మాణం కేసు..మసీదులో సర్వే చేయాలని మథుర కోర్టు తీర్పు
శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదు నిర్మాణం కేసు విషయంలో మథుర కోర్టు కీలక తీర్పునిచ్చింది. మసీదులో సర్వే చేయాలని పురావస్తుశాఖను ఆదేశించింది.

Sri Krishna Janmabhoomi Row : బాబ్రి మసీదు కేసు వివాదం సమసిపోయిన తరువాత మథురలో శ్రీకృష్ణుడు జన్మస్థలం వివాదం ఉత్తరప్రదేశ్ లోని మథుర కోర్టులో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈకేసుపై విచారణ సందర్భంగా శనివారం (డిసెంబర్ 24,2022) మధుర కోర్టు కీలక తీర్పును వెలువరించింది. శ్రీకృష్ణుడి జన్మస్థలంలో మసీదు నిర్మించారని దాఖలు అయిన పిటీషన్ పై విచారణ కొనసాగించి మథుర కోర్టు ఈ విషయంలో నిజానిజాలు వెలికి తీయాలని పురావస్తుశాఖను ఆదేశించింది. ఈ స్థలంలో సర్వే చేపట్టి నిజానిజాలను వెలికి తీసే బాధ్యతను పురావస్తుశాఖకు అప్పగించింది. శ్రీకృష్ణుడు జన్మస్థలంగా భావిస్తున్న షాహీ ఇద్గా మసీదులో జనవరి 2,2023 నుంచి సర్వే చేపట్టాలని పురావస్తుశాఖకు సూచించింది.
షాహి ఈద్గా మసీదు 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు కృష్ణ జన్మభూమి వద్ద నిర్మించబడిందని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై విచారణ కొనసాగించిన మధుర షాహి ఈద్గా మసీదుపై సర్వే చేపట్టాలని యూపీలోని మథుర కోర్టు ఆదేశించింది. జనవరి 2న ఆర్కియాలజీ శాఖ ఆధ్వర్యంలో ఆ సర్వే చేపట్టాలని సూచించిది. సర్వే పూర్తి అయ్యాక రిపోర్టును జనవరి 20వ కోర్టుకు అందజేయనున్నారు.
కాగా శ్రీకృష్ణుడు జన్మస్థలంలో మసీదు నిర్మించారని హిందూ సేనకు చెందిన విష్ణుగుప్త మథుర కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన ధర్మాసనం మసీదులో సర్వే చేయాలని ఆదేశించగా వారణాసిలో జ్ఞానవాపి మసీదు కేసు తరహాలోనే.. ఈ కేసులోనూ సర్వే చేపట్టనున్నారు.
కాగా..కట్రా కేశవ్ దేవ్ ఆలయంలో ఉన్న 17వ శతాబ్ధం నాటి షాహి ఈద్గా మజీదును తొలగించాలని డిమాండ్ చేస్తోంది హిందూ సేన. శ్రీకృష్ణుడు పుట్టిన ప్రదేశంలో 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆదేశాల మేరకు కట్రా దేవ్ ఆలయం పరిసరప్రాంతంలోనే షాహి మసీదును నిర్మించారని హిందూ సేన ఆరోపిస్తోంది. కట్రా దేవ్ ఆలయం సుమారు 13.37 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ ఆలయ పరిసరాల్లో దీన్ని నిర్మించారని విష్ణగుప్తా పిటీషన్ లో పేర్కొన్నారు.