Vodafone Idea Stake : బిర్లా సంచలన నిర్ణయం..ప్రభుత్వం చేతికి వొడాఫోన్-ఐడియా!

అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ టెలికాం సేవల సంస్థ "వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(VIL)" విషయంలో ఆ సంస్థ ప్రమోటర్‌ కుమార మంగళం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు.

Vodafone Idea Stake : బిర్లా సంచలన నిర్ణయం..ప్రభుత్వం చేతికి వొడాఫోన్-ఐడియా!

Vodafone Idea Stake అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ టెలికాం సేవల సంస్థ “వొడాఫోన్‌ ఐడియా లిమిటెడ్‌(VIL)” విషయంలో ఆ సంస్థ ప్రమోటర్‌ కుమార మంగళం బిర్లా కీలక నిర్ణయం తీసుకున్నారు. కంపెనీలోని తన వాటాల్ని ప్రభుత్వ రంగ లేదా దేశీయ ఆర్థిక సంస్థలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్లు బిర్లా ప్రకటించారు.

అయితే, ఈ ఏడాది జూన్‌లోనే కేంద్ర కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు రాసిన లేఖలో బిర్లా ఈ ఆఫర్ చేశారు. ఏజీఆర్‌ ఛార్జీలు, స్పెక్ట్రం కేటాయింపుల బకాయిల మారిటోరియంపై ప్రభుత్వం నుంచి కొత్త పెట్టుబడిదారులు కచ్చితమైన పూచీ కోరుతున్నారు. సర్కార్‌ దీనిపై స్పందించని పక్షంలో పెట్టుబడులు పెట్టేందుకు వారంతా వెనకాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కచ్చితమైన సహకారం అవసరమని లేఖలో బిర్లా కోరారు. జూలై నాటికి ఈ మూడు సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే VIL ఆర్థిక పరిస్థితి మునిగిపోయే అంచుకు చేరుకుంటుందని ఇక దీనిని నిర్వహించడం కష్టమని బిర్లా ఆ లేఖలో పేర్కొన్నారు. ఈ విషయంలో ఎలాంటి ప్రయోజనాలు ఆశించకుండా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. 27 కోట్ల భారతీయ కస్టమర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ ప్రతిపాదనతో ముందుకు వచ్చానని లేఖలో పేర్కొన్నారు.

వీఐఎల్‌లో బిర్లాకు 27 శాతం, వొడాఫోన్‌కు 44 శాతం వాటాలున్నాయి. ప్రస్తుతం VIL మార్కెట్‌ విలువ రూ.24 వేల కోట్లు. అలాగే కంపెనీలో కొత్తగా ఎలాంటి పెట్టుబడులు పెట్టొద్దని ఇరు వర్గాలు నిర్ణయించాయి. వొడాఫోన్‌ ఏకంగా ఇప్పటి వరకు ఉన్న పెట్టుబడి ప్రణాళికల్ని సైతం రద్దు చేసుకుంది.

కాగా, టెలికాం రంగంలో.. జియో, ఎయిర్‌టెల్‌ నుంచి వొడాఫోన్‌ ఐడియా తీవ్ర పోటీ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా, వీఐఎల్.. ప్రభుత్వం సహా వివిధ సంస్థలకు రూ.1.8 ట్రిలియన్లు చెల్లించాల్సి ఉంది. ప్రభుత్వానికి బకాయిలతో పాటు సవరించిన స్థూల ఆదాయ(AGR‌) ఛార్జీలు కట్టాల్సి ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం..వీఐఎల్ రూ .58,254 కోట్ల ఏజీఆర్ బకాయిలను చెల్లించాలి. ఇందులో కంపెనీ రూ .7854.37 కోట్లు చెల్లించింది. ఇంకా రూ.50,399.63 కోట్లు బాకీ ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో రూ.25 వేల కోట్ల పెట్టుబడులను సమీకరించాలని కంపెనీ బోర్డు గత సెప్టెంబరులో నిర్ణయించింది. అమెరికా సహా అనేక దేశాల్లోని పెట్టుబడి సంస్థల్ని ఆశ్రయించింది. కానీ, ప్రభుత్వ పూచీ లేనిది ఏ ఒక్క సంస్థ కూడా పెట్టుబడులకు ఆసక్తి కనబరచలేదు. అయితే, కొత్తగా పెట్టుబడులు పెట్టినప్పటికీ.. కంపెనీ ఇప్పట్లో కోలుకునే అవకాశాలు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా కంపెనీ విలువ కంటే అప్పులే ఎక్కువయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో కంపెనీలోని తన వాటాల్ని వదులుకోవడమే సరైన నిర్ణయమని భావించిన బిర్లా.. వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు అర్థమవుతోంది.

మరోవైపు,ఏజీఆర్‌ ఛార్జీల లెక్కింపునకు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికాం(డీఓటీ) అనుసరించిన విధానంలో లోపాలు ఉన్నాయంటూ పలు టెలికాం సంస్థలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఆ దోషాలు పరిహరించి లెక్కిస్తే ఏజీఆర్‌ ఛార్జీలు చాలా వరకు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నాయి. లైసెన్స్ ఫీజును మాత్రమే పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే తమ ఏజీఆర్ బకాయి రూ. 28, 308 కోట్లు మాత్రమేనని, తమ ఆదాయాన్ని లెక్కించడంలో పొరపాటు జరిగినట్టు వొడాఫోన్ ఐడియా పేర్కొంది .దీనివల్ల తాము అదనంగా దాదాపు రూ. 24,600 కోట్ల బకాయిలు నిర్ణయించినట్టు వొడాఫోన్ ఐడియా వివరించింది. ఈ నేపథ్యంలో ఏజీఆర్‌ ఛార్జీలను తిరిగి లెక్కించేలా డీఓటీకి ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా టెలీ సర్వీసెస్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే వారి అప్పీల్‌ని సుప్రీంకోర్టు తిరస్కరించింది.