అర్థకుంభమేళా : పుణ్యస్నానం చేసిన స్మృతి

  • Published By: madhu ,Published On : January 15, 2019 / 09:21 AM IST
అర్థకుంభమేళా : పుణ్యస్నానం చేసిన స్మృతి

ఉత్తర్ ప్రదేశ్ : అర్ధకుంభమేళా ప్రారంభమైంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్ రాజ్‌కు చేరుకుంటున్నారు. దీనితో ఆ ప్రాంతమంతా కిక్కిరిసిపోతోంది. 2019, జనవరి 15వ తేదీ నుంచి కుంభమేళా జరుగనుంది. మార్చి 4వ తేదీ వరకు కొనసాగనుంది. 49 రోజులపాటు అర్ధ కుంభమేళా జరుగనుంది. క్రతువు తొలిరోజు పుణ్య స్నానమాచరించడానికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ జనవరి 15వ తేదీ మంగళవారం తెల్లవారుజామున ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్నారు. గంగానదిలో ఆమె పుణ్యస్నానమాచరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోను తన ట్విటర్‌ ద్వారా పోస్టు చేశారు.
భారీ ఏర్పాట్లు…
ఈ అర్ధకుంభమేళాకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ భారీ ఏర్పాట్లు చేసింది. ఏకంగా రూ. 4వేల కోట్ల రూపాయలను కేటాయించింది. స్నాన ఘట్టాల దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు, పారామిలటరీ బలగాలు భారీగా మోహరించాయి. దాదాపు 20వేల మంది పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొంటున్నారు. 
దాదాపు 150 మిలియన్ల మంది భక్తులు కుంభమేళాకు హాజరయ్యే అవకాశం ఉందని యూపీ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దాదాపు లక్ష బయో పోర్టబుల్‌ టాయిలెట్స్‌ను ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసేందుకు 25వేల మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు.