Kumbha Mela: కరోనా కేసులు పెరిగినా.. కుంభమేళాను కుదించడం కుదరని పని

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న వేళ..

Kumbha Mela: కరోనా కేసులు పెరిగినా.. కుంభమేళాను కుదించడం కుదరని పని

రెచమ్ల చానల

Kumbha Mela: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళా ఏప్రిల్ 30వ తేదీ వరకు కొనసాగుతుందని, కొవిడ్‌ కేసులు పెరుగుతున్న వేళ కుంభమేళాను నిలిపేసేందుకు ఎలాంటి చర్చలు జరగలేదని అధికారులు తెలిపారు. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో కుంభమేళా నిర్వహణపై వస్తున్న ఊహాగానాలపై ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ యంత్రాంగం స్పష్టతనిచ్చింది. ముందు నిర్ణయించిన షెడ్యూల్‌ ప్రకారమే కుంభమేళా జరుగుతుందని హామీ ఇచ్చింది. రెండు వారాల ముందుగానే కార్యక్రమాన్ని ముగించే అవకాశం ఉందనే వార్తల్ని కొట్టిపారేసింది.

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం మతపెద్దలతో చర్చలు జరుపుతుందన్న వార్తలు వినిపించాయి. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని కుదించాలని ప్రతిపాదించగా.. అందుకు మతపెద్దలు నిరాకరిస్తున్నారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అలాంటి చర్చలేమీ జరగలేదని.. కుంభమేళా యథావిధిగా జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు. వాస్తవానికి కుంభమేళా జనవరిలో ప్రారంభమయ్యేది. కానీ, కొవిడ్‌ పరిస్థితుల నేపథ్యంలో ఈ సారి ఏప్రిల్‌లో నిర్వహించాలని ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రస్తుత పరిస్థితుల్లో కుంభమేళాను కేంద్రం కుదించనుండటంపై ఎలాంటి సమాచారం అందలేదని కుంభమేళా అధికారి దీపత్‌ రావత్‌ పేర్కొన్నారు. గంగానది ఒడ్డున జరుగుతున్న కుంభమేళా కార్యక్రమానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు.

ఈ క్రమంలో పవిత్ర స్నానాలు చేసేందుకు వస్తున్న భక్తులు పెద్ద ఎత్తున కరోనా మహమ్మారి బారినపడుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం రద్దీ లేని ఘాట్‌లలో సామాజిక దూరాన్ని అనుసరించనందుకు భక్తులకు జరిమానా విధిస్తున్నారు. ప్రధాన ఘాట్‌లలో రద్దీగా ఉన్న చోట్ల జరిమానాల విధింపు చాలా కష్టమని పోలీస్‌ అధికారి సంజయ్‌ గుంజ్యాల్‌ పేర్కొన్నారు. కుంభమేళాలో మరో ముఖ్యమైన తేదీ ఏప్రిల్ 27. ఆ రోజు పెద్ద ఎత్తున భక్తులు ‘షాహీ స్నానాలు’ చేసేందుకు వస్తారనేది అంచనా.

ఈ ఏడాది మతపరమైన సమావేశాలు విరమించకూడదనే నిర్ణయంపై దేశవ్యాప్తంగా విమర్శలు వచ్చాయి. పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉండడంతో సూపర్‌ స్ప్రెడర్‌గా మారే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కుంభమేళా నిర్వహణను విరమించుకునేందుకు అఖాదాస్‌, సీర్‌ గ్రూపులు నిరాకరించాయి. హర్‌కీ పౌరి ఘాట్‌ వద్ద స్నానాలు చేసే భక్తులు సామాజిక దూరం పాటించడం, మాస్క్‌ ధరించడం వంటి చర్యలపై పోలీసులు జాగ్రత్త తీసుకుంటున్నారు. బుధవారం ఒకే రోజు ఉత్తరాఖండ్‌లో 2వేల 167 మంది కొవిడ్‌ బారినపడ్డారు. ఇందులో 525 మంది హరిద్వార్‌లో చేసిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది.