ఘోర ప్రమాదం, 16మంది కూలీలు అక్కడికక్కడే మృతి

ఘోర ప్రమాదం, 16మంది కూలీలు అక్కడికక్కడే మృతి

16 labourers dead after truck overturns: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మంది చనిపోయారు. జల్‌గావ్ జిల్లాలో ప్రమాదం చోటుచేసుకుంది. బొప్పాయి లోడుతో వెళ్తున్న ఐషర్ ట్రక్కు.. యావల్ తాలూకా కింగావ్ గ్రామంలో ఓ ఆలయం దగ్గర బోల్తా పడింది. దీంతో ట్రక్కులో ఉన్న కూలీల్లో 16మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ప్రమాద సమయానికి ట్రక్కులో 21 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

బొప్పాయి లోడుతో ధులే నుంచి చోప్డా మీదుగా రావేర్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ట్రక్కు అకస్మాత్తుగా బోల్తా పడి ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదంలో మృతిచెందిన వారంతా అబోదా, కెర్హాలా, రావేర్‌కు చెందిన కూలీలుగా గుర్తించారు. గాయపడిన వారిని చికిత్స కోసం జలగావ్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అర్ధరాత్రి ఈ ప్రమాదం జరగడంతో సమాచారం ఆలస్యంగా తెలిసింది. స్థానికులు సహాయక చర్యలు చేపట్టి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. పోస్టు‌మార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాల్లో విషాదం అలుముకుంది. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. అంతా పేద కుటుంబాలే. రెక్కాడితే కానీ డొక్కాడదు. అలాంటి కుటుంబాల్లో ఈ ప్రమాదం తీరని విషాదం నింపింది. ఇంటిని పోషించే వారే చనిపోవడంతో ఆ కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.

ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులతో చెప్పారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.