ప్రధాని మోడీ ఓ పిరికివాడు..చైనా ముందు తలవంచాడు

ప్రధాని మోడీ ఓ పిరికివాడు..చైనా ముందు తలవంచాడు

Rahul Gandhi ప్రధాని మోడీ లక్ష్యంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. చైనాను ఎదుర్కోవటంలో ప్రధాని విఫలమయ్యారనన్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం రాహుల్‌ గాంధీ రాజస్థాన్‌ వెళ్లారు. మధ్యాహ్నం శ్రీగంగానగర్‌ ప్రాంతంలోని హనుమాన్‌ఘర్‌ వద్ద నిర్వహించిన మహా పంచాయత్‌ సమావేశానికి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చి.. ఆ దేశం ముందు మోడీ తలవంచారని ఆరోపించారు.

భారత భూభాగాన్ని సంరక్షించటం ప్రధాని బాధ్యతన్నారు. కానీ ప్రధానికి అదే సమస్యగా మారిందని.. అదేంటో తనకు అర్థం కావట్లేదన్నారు. భారత భూభాగంలో అంగుళం కూడా ఎవ్వరూ ఆక్రమించుకోలేరని.. రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​ పార్లమెంట్​లో గురువారం చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ కేంద్రంపై మాటల దాడి చేశారు రాహుల్. భారత బలగాలు ఫింగర్​ 4 నుంచి ఫింగర్​ 3కి ఎందుకు వస్తున్నాయో ప్రధాని, రక్షణ మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్​ చేశారు.

భారత బలగాలు ఫింగర్​ 4 నుంచి ఫింగర్​ 3కి రానున్నాయి. ఫింగర్​ 4 మన భూభాగంలోది. ఆ ప్రాంతాన్ని ప్రధాని చైనాకు ఎందుకు ఇచ్చారు? మన సైనికులు వీరోచితంగా పోరాడి కైలాశ్​ పంక్తులను సొంతం చేసుకుంటే.. వారిని ఎందుకు వెనక్కి వచ్చేయమంటున్నారు? ఈ చర్య వల్ల భారత్​కు లాభం ఏంటి? వ్యూహాత్మంగా ఎంతో ప్రాముఖ్యం ఉన్న దేప్సాంగ్​ ప్రాంతం నుంచి చైనా బలగాలు ఎందుకు వెనక్కి వెళ్లటం లేదు? ప్రధాని భారత భూభాగాన్ని చైనాకు ఇచ్చి.. వారి ముందు తలవంచారు అని రాహుల్ విమర్శించారు.సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో మన భూభాగాన్ని చైనా ఆక్రమించుకుంటున్నా చేతగాని ప్రధాని మోడీ కారణంగానే ఏమీ చేయలేకపోతున్నామన్నారు.

కాగా,భారత్​-చైనా మధ్య చర్చలు ఓ కొలిక్కి వచ్చాయని రక్షణ మంత్రి గురువారం రాజ్​నాథ్ సింగ్ పార్లమెంట్​లో చెప్పిన విషయం తెలిసిందే. పాంగాంగ్​ సరస్సు ఉత్తర, దక్షిణ ప్రాంతాల నుంచి బలగాలను ఉపసంహరించుకునేలా భారత్​-చైనా ఒప్పందం కుదిరిందని..దీని ప్రకారం ఇరు దేశాలు తమ బలగాలను విడతల వారీగా, సమన్వయంతో వెనక్కి పంపనున్నాయని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు ఫలించాయని.. అయితే కొన్ని ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించడం, పెట్రోలింగ్​ వంటి సమస్యలున్నాయని రాజ్ నాథ్ తెలిపారు. పూర్తి స్థాయి బలగాల ఉపసంహరణపై రానున్న రెండు రోజుల్లో కమాండర్​ స్థాయిలో చర్చలు జరగనున్నట్లు పేర్కొన్నారు. పాంగాంగ్​ ఉత్తర ప్రాంతంలోని ఫింగర్​ 8 వద్ద చైనా బలగాలు.. భారత బలగాలు ఫింగర్​ 3 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ (ధన్ సింగ్ తాపా పోస్ట్)దగ్గర ఉంటాయని రాజ్ నాథ్ పేర్కొన్నారు.