Landslide : మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండచరియలు, 30మంది గల్లంతు

భారీ వర్షాలు మహా‌రాష్ట్రను వణి‌కిస్తున్నాయి. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడ్డాయి. రాయగఢ్‌ జిల్లా మహద్ తలై గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది.

Landslide : మహారాష్ట్రలో విరిగిపడ్డ కొండచరియలు, 30మంది గల్లంతు

Landslide

Landslide : భారీ వర్షాలు మహా‌రాష్ట్రను వణి‌కిస్తున్నాయి. వరదలు ముంచెత్తాయి. జనజీవనం స్తంభించింది. ఇది చాలదన్నట్టు ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో కొండచరియలు విరిగిపడ్డాయి. రాయగఢ్‌ జిల్లా మహద్ తలై గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 35 ఇళ్లు చరియల కింద పూడుకుపోయాయి. శిథిలాల కింద సుమారు 30 మందికిపైగా చిక్కుకున్నట్లు సమాచారం. ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సమాచారం అందించామని రాయ్‌గఢ్‌ జిల్లా కలెక్టర్‌ తెలిపారు. భారీ వర్షాల కారణంగా ఆ ప్రాంతమంతా నీటమునిగింది. ఈ ఘటనపై రాయ్‌గఢ్‌ ఇన్‌చార్జి మంత్రి అతిథి తట్కారే కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కోరారు.

మహారాష్ట్రపై వరణుడు పగబట్టాడు. మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. మరో మూడు రోజులు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైతోపాటు అన్ని ప్రధాన నగరాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. రాయగడ్, రత్నగిరి, పూణే సతారా, కొల్హాపూర్ జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ముంబై, పాల్ఘార్, థానే ప్రాంతాలకు ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. భారీ వర్షాలతో కొంకణ్‌, ముంబై మెట్రోపాలిటన్‌, విదర్భలో పలు ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

ప్రధానంగా కొంకణ్ ప్రాంతం భారీగా నష్టపోయింది. రత్నగిరి జిల్లాలోని అనేక ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపింది. తీవ్ర వరదలు రావడంతో ముంబై-గోవా హైవే మూసివేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

మహారాష్ట్రలో భారీ వర్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరేకు గురువారం సాయంత్రం ఫోన్ చేశారు. భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. కేంద్రం నుంచి మహారాష్ట్రకు అవసరమైన సాయాన్ని తప్పకుండా అందిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశమంతటా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలో మాత్రం అసాధారణ రీతిలో వానలు పడుతున్నాయి. ఈ రెండు రాష్ట్రాలు గడిచిన మూడు రోజులుగా వరదతో విలవిల్లాడుతున్నాయి.