నేను చనిపోవడానికి అనుమతి ఇవ్వండి

  • Published By: vamsi ,Published On : December 17, 2019 / 02:38 AM IST
నేను చనిపోవడానికి అనుమతి ఇవ్వండి

దేశం మొత్తం ఇప్పుడు పౌరసత్వ సవరణ బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లును కొందరు వ్యతిరేకిస్తుంటే కొందరు స్వాగతిస్తున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా శరణార్థుడిగా శ్రీలంక నుంచి వచ్చిన ఓ వ్యక్తి తనకు కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ కలెక్టర్‌కు అర్జీ పెట్టుకున్నాడు.

శరణార్థుడిగా శ్రీలంక నుంచి వచ్చి 28 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నా భారత పౌరసత్వం లభించలేదని, కారుణ్య మరణానికి అనుమతించాలని యనద్ అనే యువకుడు తమిళనాడులోని సేలం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం అందజేశాడు. సేలం జిల్లా పవలతనూరు శ్రీలంక శరణార్థుల శిబిరంలో ఉంటూ యనద్ పీహెచ్‌డీ చేస్తున్నారు.

అయితే అతనికి ఇప్పటివరకు భారత పౌరసత్వం లభించలేదు. ఈ క్రమంలో కారుణ్య మరణాన్ని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. తాను శ్రీలంక నుంచి పడవలో వచ్చానని, భారత పౌరసత్వం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంలో శ్రీలంక శరణార్థులను చేర్చలేదని ఇక మాకు న్యాయం జరిగే అవకాశమే లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కారుణ్య మరణానికి అనుమతి కోరాడు.